మెర్కేటర్ మ్యాప్‌తో మారిన ప్రపంచ చిత్రం.
మన చిన్నప్పటి నుంచీ గోడపై చూసిన ప్రపంచ పటం నిజంగా ప్రపంచం అంతేనా? భారత్ ఎంత పెద్ద దేశమో మనకు తెలుసు.. కానీ ప్రపంచ పటంలో చూస్తే ఆ పరిమాణం అంతగా కనిపించదు. కారణం దేశం చిన్నది కావడం కాదు.. భూమి గుండ్రంగా ఉండగా దాన్ని చదునైన పటంగా మార్చడంలో జరిగే భౌగోళిక వక్రీకరణ. ముఖ్యంగా మెర్కేటర్ మ్యాప్ ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలను భారీగా చూపించింది. దీంతో గ్రీన్‌లాండ్ ఆఫ్రికాతో సమానంగా కనిపించే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్‌లాండ్ కంటే దాదాపు 14 రెట్లు పెద్దది. ఇప్పుడు ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ ప్రపంచ భూభాగాల అసలు పరిమాణాన్ని మరింత స్పష్టంగా చూపించేందుకు ముందుకొస్తోంది. దీంతో భారత్ కూడా మనం ఇంతకాలం చూసిన దానికంటే కొంత పెద్దగా కనిపించనుంది.
చిన్నప్పటి నుంచి మనం చూసిన ప్రపంచ పటం నిజమైన భూభాగ పరిమాణాలను పూర్తిగా చూపించదు. భూమి గుండ్రంగా ఉండగా.. దాన్ని చదునైన పటంగా చూపించాల్సి రావడంతో కొన్ని ప్రాంతాల పరిమాణాల్లో తేడాలు వస్తాయి. ముఖ్యంగా 1569లో ఫ్లెమిష్ కార్టోగ్రాఫర్ గెరార్డ్ మెర్కేటర్ రూపొందించిన మెర్కేటర్ ప్రొజెక్షన్ నావిగేషన్ కోసం ఉపయోగకరంగా ఉన్నా.. దేశాల అసలు పరిమాణాలను వక్రీకరిస్తుంది. ఉత్తర, దక్షిణ ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు వాస్తవం కంటే చాలా పెద్దగా కనిపిస్తాయి. అందుకే గ్రీన్‌లాండ్ ఆఫ్రికాతో దాదాపు సమానంగా కనిపిస్తుంది. కానీ వాస్తవంలో ఆఫ్రికా గ్రీన్‌లాండ్ కంటే దాదాపు 14 రెట్లు పెద్దది. రష్యా, కెనడా, యూరప్, ఉత్తర అమెరికా కూడా మెర్కేటర్ పటంలో ఎక్కువ పరిమాణంలో కనిపిస్తాయి. మరోవైపు భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఆఫ్రికా, దక్షిణ అమెరికా, భారత్ వంటి ప్రాంతాలు తమ వాస్తవ విస్తీర్ణం కంటే చిన్నగా కనిపిస్తాయి.
భారత్ సైజు కూడా ఎక్కువే
ఈ వక్రీకరణను తగ్గించేందుకు ఐక్యరాజ్యసమితి ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ వైపు మార్పును సమర్థించింది. 2018లో కార్టోగ్రాఫర్ల బృందం రూపొందించిన ఈ పటం నావిగేషన్ కంటే భూభాగాల అసలు పరిమాణాలను స్పష్టంగా చూపించడంపై దృష్టి పెడుతుంది. ఈక్వల్ ఎర్త్‌లో ఆఫ్రికా మరింత పెద్దగా కనిపిస్తుంది. ఉత్తర అమెరికా, యూరప్ పరిమాణం తగ్గినట్లు కనిపిస్తాయి. దక్షిణ అమెరికా వాస్తవ పరిమాణానికి దగ్గరవుతుంది. భారత్ కూడా మెర్కేటర్ మ్యాప్‌తో పోలిస్తే కొంత పెద్దగా కనిపిస్తుంది. ఆఫ్రికన్ యూనియన్ సభ్య దేశాలు కూడా ఫిబ్రవరిలో ఈ ప్రొజెక్షన్‌ను స్వీకరించాయి. మ్యాపులు కేవలం ప్రదేశాలను గుర్తించేందుకు మాత్రమే కాకుండా ప్రపంచంలోని ప్రాంతాలపై మన అభిప్రాయాలను ప్రభావితం చేస్తాయని కెన్యా భూగోళ శాస్త్రవేత్త కియోకో ముయెండో పేర్కొన్నారు.
పర్ఫెక్ట్ మ్యాప్ అనేదే లేదు
అయితే ఈక్వల్ ఎర్త్ కూడా సంపూర్ణ పరిష్కారం కాదు. ఒక గుండ్రని భూమిని పూర్తిగా చదునుగా చూపించే సమయంలో పరిమాణం, ఆకారం, దూరం, దిశ అన్నింటినీ ఒకేసారి ఖచ్చితంగా చూపించడం సాధ్యం కాదు. మెర్కేటర్ మ్యాప్ దిశలు, నావిగేషన్‌కు అనుకూలంగా ఉంటుంది కానీ పరిమాణాల్లో తేడాలు చూపిస్తుంది. పీటర్స్ ప్రొజెక్షన్ భూభాగ విస్తీర్ణాన్ని వాస్తవానికి దగ్గరగా చూపించినా ఆకారాలను మార్చేస్తుంది. ఈక్వల్ ఎర్త్ మాత్రం భూభాగాల పరిమాణాల విషయంలో మరింత సమతుల్యమైన చిత్రాన్ని అందిస్తుంది. అందుకే ప్రపంచానికి ఒకే ఒక్క ‘పర్ఫెక్ట్ మ్యాప్’ ఉండదు. ఏ ప్రొజెక్షన్ ఎంచుకున్నా ఏదో ఒక అంశంలో కొంత వక్రీకరణ తప్పదు.
#IndiaTrueSize #IndiaOnWorldMap #MercatorMap #MercatorProjection #EqualEarth #WorldMap #MapDistortion #MapProjection #IndiaMap #GeographyFacts #AfricaVsGreenland #Greenland #Africa #WorldGeography #IndiaGeography #MapFacts











