Home General అది ఉద్యోగం కాదు గిగ్‌ వర్కర్ బతుకు పోరాటం!

అది ఉద్యోగం కాదు గిగ్‌ వర్కర్ బతుకు పోరాటం!

గంటలు పెరిగినా.. భద్రత కరువే.

దేశంలో ఫుడ్‌ డెలివరీ, క్యాబ్‌ డ్రైవింగ్‌, ఈ-కామర్స్‌ డెలివరీ, ఇంటి సేవల వంటి గిగ్‌ పనులు తాత్కాలిక ఉపాధి స్థాయి దాటి చాలామందికి పూర్తి స్థాయి ఉద్యోగంగా మారిపోయాయని జనపహల్‌ సంస్థ నిర్వహించిన దేశవ్యాప్త సర్వే వెల్లడించింది. పది నగరాల్లో 1,000 మంది ప్లాట్‌ఫామ్‌ కార్మికులను సర్వే చేసిన సంస్థ.. వారి పని పరిస్థితులపై ఆందోళనకర అంశాలను బయటపెట్టింది. దాదాపు 57 శాతం మంది వారానికి 49 గంటలకు పైగా పనిచేస్తుండగా, సుమారు 23 శాతం మంది 70 గంటలకు మించి పనిచేస్తున్నారు. ప్లాట్‌ఫామ్‌లపై ఏడాదికి పైగా కొనసాగుతున్నవారి సంఖ్య 72.3 శాతంగా ఉంది. వీరిలో 38.4 శాతం మంది రెండేళ్లకు పైగా, 18.4 శాతం మంది ఐదేళ్లకు పైగా ఇదే పనిపై ఆధారపడి ఉన్నారు.

పని ప్రదేశంలో కనీస సౌకర్యాలు కూడా లేవు
గిగ్‌ కార్మికులకు ఎక్కువ పని గంటలతో పాటు ప్రాథమిక సౌకర్యాల కొరత తీవ్రంగా ఉందని నివేదిక పేర్కొంది. 74.6 శాతం మందికి విశ్రాంతి తీసుకునే ప్రదేశం లేదు. 53.8 శాతం మంది తాగునీటిని సొంత డబ్బులతో కొనుగోలు చేస్తున్నారు. 66.2 శాతం మంది పని సమయంలో అరుదుగా లేదా అసలు విరామమే తీసుకోవడం లేదు. దాదాపు 43.9 శాతం మంది డబ్బులు చెల్లించి పబ్లిక్‌ టాయిలెట్లు ఉపయోగిస్తున్నారు. మరో 15 శాతం మందికి పని సమయంలో టాయిలెట్‌ సౌకర్యమే లేదు. రోడ్డు ప్రమాదాల ముప్పు కూడా ఎక్కువగానే ఉంది. 62.2 శాతం మంది ప్రమాదానికి తృటిలో తప్పించుకున్న అనుభవం చెప్పగా, 27 శాతం మంది పని సమయంలో ట్రాఫిక్‌ ప్రమాదాలకు గురయ్యారు. 38 శాతం మంది రోడ్ల దుస్థితి కారణంగా గాయపడ్డారు. మరోవైపు 34.1 శాతం మంది వేధింపులు, దుర్వినియోగం లేదా హింసను ఎదుర్కొన్నారు.

ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నా.. రక్షణ లేదు
అధిక పని గంటలు, ఎండ, కాలుష్యం, రోడ్లపై నిరంతర ప్రయాణం కారణంగా కార్మికుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని సర్వే తెలిపింది. 64.5 శాతం మందికి అలసట, నిద్ర సమస్యలు, 47.4 శాతం మందికి కండరాలు, ఎముకల నొప్పులు, 41.1 శాతం మందికి ఒత్తిడి, ఆందోళన ఎదురవుతున్నాయి. 30 శాతం మంది కంటి సమస్యలు, 26.5 శాతం మంది శ్వాస సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ 68.4 శాతం మందికి ప్లాట్‌ఫామ్‌ సంస్థల నుంచి ఆరోగ్య సహాయం అందడం లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు గిగ్‌ కార్మికులను చట్టపరంగా కార్మికులుగా గుర్తించాలని జనపహల్‌ డిమాండ్‌ చేసింది. టాయిలెట్లు, తాగునీరు, విశ్రాంతి ప్రదేశాలు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు వృత్తి భద్రతా ప్రమాణాలు, వాతావరణ మార్పులకు అనుగుణమైన విధానాలు, కార్మికుల హక్కులకు చట్టపరమైన రక్షణ కల్పించాలని సూచించింది.

 

#GigWorkers #GigEconomy #PlatformWorkers #GigWorkersIndia #DeliveryWorkers #FoodDelivery #CabDrivers #EcommerceWorkers #LabourRights #WorkerSafety #SocialSecurity #WorkersRights #Employment #IndiaNews #LabourNews