కేంద్రం ఉక్కుపాదం అశ్లీల కంటెంట్‌కు చెక్‌ 50 ఓటీటీ వేదికలు బ్లాక్‌

The Central Government has blocked 50 OTT platforms over obscene content and legal violations, while introducing stricter rules for removing unlawful online content and strengthening digital safety.

16

కేంద్రం ఉక్కుపాదం
అశ్లీల కంటెంట్‌కు చెక్‌
50 ఓటీటీ వేదికలు బ్లాక్‌

అశ్లీల కంటెంట్‌ ప్రసారం, చట్టాల ఉల్లంఘనపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. గత రెండేళ్లలో భారత్‌లో ప్రజల యాక్సెస్‌ను 50 ఓటీటీ వేదికలకు నిలిపివేసినట్లు కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 67, 67ఏ, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్‌ 294, మహిళల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టంలోని నిబంధనలను ఉల్లంఘించిన కారణంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

మూడు గంటల్లో తొలగింపు తప్పనిసరి

సామాజిక మాధ్యమాలు, డిజిటల్‌ వేదికలపై చట్టవిరుద్ధ కంటెంట్‌ను వేగంగా తొలగించేలా కేంద్రం నిబంధనలు మరింత కఠినతరం చేసింది. కోర్టు ఉత్తర్వు లేదా ప్రభుత్వ అధికారిక సమాచారం అందిన మూడు గంటల్లోనే అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అమలు కాకపోతే సంబంధిత వేదికలపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

సురక్షిత డిజిటల్‌ వాతావరణమే లక్ష్యం

డిజిటల్‌ మీడియా ప్రచురణకర్తలు, ఓటీటీ వేదికల కోసం ప్రత్యేక వ్యవస్థను రూపొందించినట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ తెలిపింది. వినియోగదారులకు భద్రమైన, విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన ఇంటర్నెట్‌ వాతావరణాన్ని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంది. ముఖ్యంగా చిన్నారుల గోప్యత, ఆన్‌లైన్‌ భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ డిజిటల్‌ వ్యక్తిగత డేటా పరిరక్షణ చట్టాన్ని అమలు చేస్తున్నట్లు వివరించింది.

యువతలో డిజిటల్‌ వ్యసనంపై ఆందోళన

ఆర్థిక సర్వే 2025-26 ప్రకారం 15 నుంచి 29 సంవత్సరాల మధ్య వయసున్న యువతలో డిజిటల్‌ వ్యసనం తీవ్ర ప్రజారోగ్య సమస్యగా మారిందని ప్రభుత్వం గుర్తు చేసింది. ఆన్‌లైన్‌ గేమింగ్‌, సామాజిక మాధ్యమాల అధిక వినియోగం వల్ల కలిగే ఆర్థిక, మానసిక ప్రభావాలను తగ్గించేందుకు ప్రత్యేక చట్టాలు అమల్లో ఉన్నాయని వెల్లడించింది. పిల్లలు, యువత సురక్షితంగా డిజిటల్‌ ప్రపంచాన్ని వినియోగించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు

సైబర్‌ భద్రతపై ప్రజల్లో చైతన్యం పెంచేందుకు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 6,650 శిక్షణ శిబిరాలు నిర్వహించినట్లు కేంద్రం వెల్లడించింది. 11.37 లక్షల మందికి పైగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సైబర్‌ మోసాలు, ఆన్‌లైన్‌ భద్రత, పిల్లల రక్షణపై పుస్తకాలు, పోస్టర్లు, వీడియోలు, కార్టూన్‌ కథలు విడుదల చేసినట్లు తెలిపింది. సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీల సహకారంతో విద్యార్థుల్లో బాధ్యతాయుత డిజిటల్‌ వినియోగంపై అవగాహన పెంచుతున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.