దేశమంటే మట్టికాదోయ్..
దేశమంటే మనుషులోయ్!
ఫుడ్‌ యాప్‌లతో సంఘీభావం
జంతర్‌మంతర్‌కు అన్నదాతలు వెల్లువ
దేశం నలుమూలల నుంచి ఫుడ్‌ సపోర్ట్‌
నిరసనకారులకు ప్రజల భోజన అండ

ఒకవైపు బారికేడ్లు… మరోవైపు భద్రతా వలయం… మధ్యలో తమ హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు. అలాంటి వేళ దేశం నలుమూలల నుంచి వచ్చిన స్పందన మాత్రం మానవత్వానికి కొత్త అర్థం చెప్పింది. ఎవరో తెలియని యువకుడి ఆకలి తీర్చాలనే ఆలోచనతో వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు ఫుడ్‌ యాప్‌లలో ఆర్డర్లు పెట్టారు. దేశంలోని నగరాల నుంచే కాదు, విదేశాల్లో ఉన్న భారతీయులు సైతం “జంతర్‌మంతర్‌లో ఉన్న ఎవరికైనా ఇవ్వండి” అనే ఒక్క సూచనతో పిజ్జాలు, బర్గర్లు, థాళీలు, సమోసాలు పంపించారు. నిరసనలో పాల్గొనలేకపోయినా, తమ మనసు మాత్రం అక్కడే ఉందని ఆహారం రూపంలో చాటిచెప్పారు. ఆకలికి రాజకీయాలు ఉండవని, సహాయానికి పరిచయాలు అవసరం లేదని ఈ స్పందన మరోసారి నిరూపించింది. ఆహారం అందిస్తున్న డెలివరీ సిబ్బంది నుంచి దానిని పంచుతున్న వాలంటీర్ల వరకు ప్రతి ఒక్కరూ మానవత్వానికి నిలువెత్తు రూపంగా నిలిచారు. చివరకు అవసరానికి మించి ఆహారం చేరడంతో “ఇక పంపొద్దు… మీ ప్రేమ చాలింది” అని నిర్వాహకులే విజ్ఞప్తి చేయాల్సి రావడం, ఈ దేశంలో కరుణ ఇంకా సజీవంగానే ఉందనే విషయాన్ని హృదయానికి హత్తుకునేలా గుర్తు చేసింది.

దేశాన్ని కదిలించిన ఆందోళన

జంతర్‌మంతర్‌లో కొనసాగుతున్న విద్యార్థుల నిరసనకు దేశవ్యాప్తంగా అపూర్వ స్పందన కనిపించింది. వందలాది మంది ఫుడ్‌ డెలివరీ యాప్‌ల ద్వారా ఆహారం ఆర్డర్‌ చేసి నిరసనకారులకు పంపించారు. ఆర్డర్‌లో పేరు, వ్యక్తి వివరాలు లేకుండా “జంతర్‌మంతర్‌ నిరసనలో ఉన్న ఎవరికైనా ఇవ్వండి” అనే సూచన మాత్రమే నమోదు చేశారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచే కాదు, విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా ఇదే విధంగా ఆహారం పంపించి తమ మద్దతు తెలిపారు.

పిజ్జాల నుంచి సమోసాల వరకు

నిరసన ప్రాంగణం వద్ద ప్రతి కొద్ది నిమిషాలకు ఒక డెలివరీ ఏజెంట్‌ చేరుకునే పరిస్థితి కనిపించింది. పిజ్జాలు, బర్గర్లు, మోమోలు, థాళీలు, చాయ్‌, సమోసాలు ఇలా రకరకాల ఆహార పదార్థాలు వరుసగా చేరాయి. ఒకే ఆర్డర్‌లో 80 పిజ్జాలు పంపించిన ఘటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆర్డర్ల సంఖ్య ఎక్కువ కావడంతో కొంతమంది రెస్టారెంట్‌ మేనేజర్లు కూడా స్వయంగా డెలివరీ చేయాల్సి వచ్చింది. బెంగళూరులో నర్సింగ్‌ చదువుతున్న బిహార్‌కు చెందిన ఓ యువకుడు తాను గతంలో నీట్‌ పరీక్ష రాసినప్పుడు కూడా ప్రశ్నపత్రం లీక్‌ వివాదాన్ని ఎదుర్కొన్నానని తెలిపాడు. ప్రస్తుతం నిరసనకు హాజరు కాలేకపోయినా విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు పిజ్జాలు పంపించినట్లు వివరించాడు. మరికొందరు ఆహారం అందిందని ఫొటోలు, వీడియోలు పంపాలని కూడా డెలివరీ సిబ్బందిని కోరారు.

డెలివరీ సిబ్బందికి కొత్త అనుభవం

చాలామంది డెలివరీ భాగస్వాములు ఒకే రోజు 15 నుంచి 20 సార్లకు పైగా జంతర్‌మంతర్‌కు వెళ్లి వచ్చారు. కొందరికి తక్కువ పారితోషికం వచ్చినా విద్యార్థుల కోసం ఆహారం అందించడం ఆనందంగా అనిపించిందని చెప్పారు. నిరసనలో ఉన్న యువత మంచి లక్ష్యం కోసం పోరాడుతున్నారనే భావనతో అదనపు శ్రమను కూడా భరించినట్లు వెల్లడించారు. సాయంత్రానికి నిరసన ప్రాంగణంలో ఆహారం విపరీతంగా పేరుకుపోయింది. పంపిణీ చేయడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో కాక్‌రోచ్‌ జనతా పార్టీ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రత్యేక విజ్ఞప్తి చేసింది. నిరసనకారులపై దేశ ప్రజలు చూపిన ప్రేమకు కృతజ్ఞతలు తెలిపిన పార్టీ, ఆ రోజు అవసరానికి మించిన ఆహారం అందిందని, ఇకపై మరిన్ని ఆర్డర్లు పంపవద్దని కోరింది. ఈ ఘటన నిరసనకు దేశవ్యాప్తంగా లభించిన సామాజిక మద్దతుకు అరుదైన ఉదాహరణగా నిలిచింది.