అక్రమాలపై పోలీసుల మౌనం
తాడిపత్రిలో అరాచకాలన్నపెద్దారెడ్డి
తాడిపత్రి నియోజకవర్గంలో అక్రమ మద్యం, గంజాయి, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీస్ స్టేషన్ల సమీపంలోనే ఇలాంటి వ్యవహారాలు జరుగుతున్నా పోలీసులు, ఉన్నతాధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్లకు ‘జేసీ స్టేషన్లు’ అని పేరు పెట్టండి అంటూ జేసీ కుటుంబాన్ని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గోవా లిక్కర్ అక్రమ సరఫరాపై వైఎస్సార్సీపీ నేతలతో కమిటీ వేయాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి కోరుతున్నారని పేర్కొన్న పెద్దారెడ్డి.. వైఎస్సార్సీపీ నేతలతో ఎందుకు కమిటీ అని ప్రశ్నించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, టీజీ భరత్‌లతో కమిటీ వేసి తాడిపత్రిలోని అక్రమ కార్యకలాపాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
బెదిరింపులపై ఎస్పీకి ఫిర్యాదు
టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి, ఆయన తండ్రి జేసీ ప్రభాకర్‌రెడ్డిపై పెద్దారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 24 మంది వైఎస్సార్సీపీ నేతలను అంతం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదని అన్నారు. తాడిపత్రిలో వివాహ వేడుకలకు హాజరుకావాలన్నా జేసీ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. గోవా లిక్కర్ వ్యవహారంలో మార్ఫింగ్ ఫొటోలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. జేసీ వ్యవహారాలపై కలెక్టర్, ఎస్పీ మౌనం వహించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు.
కేసులపై కఠిన చర్యలు తప్పవు
జేసీ ట్రావెల్స్ చీటింగ్, క్రిమినల్ కేసులు ఉన్నాయని పెద్దారెడ్డి పేర్కొన్నారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్క్రాప్ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. తాడిపత్రిలో జరుగుతున్న పరిణామాలపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. జేసీకి వత్తాసు పలికిన వారిపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాడిపత్రిలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్రమ మద్యం, గంజాయి, పేకాటపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పెద్దారెడ్డి కోరారు.
#KetireddyPeddireddy #Tadipatri #TadipatriPolitics #JCPrabhakarReddy #JCAsmithReddy #TadipatriLawAndOrder #IllegalLiquor #GoaLiquor #Cannabis #Gambling #YSRCP #TDP #AndhraPradeshPolitics #Peddireddy #JCFamily #PoliceStations #PoliticalControversy











