ఏఐపై బెర్నీ సాండర్స్ బిగ్ బిల్.
సూపర్ ఇంటెలిజెన్స్‌పై శాశ్వత నిషేధం.
సూపర్ ఇంటెలిజెన్స్.. పేరు వింటేనే అద్భుతంగా అనిపిస్తుంది. కానీ అదే మానవ నియంత్రణను దాటితే? మనిషి ఆలోచనలను మించే సామర్థ్యం, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే శక్తి, తన లక్ష్యాలను తానే మార్చుకునే స్థాయి ఏఐ అందుబాటులోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? టెక్నాలజీ ప్రపంచం వేగంగా ముందుకు సాగుతున్న వేళ.. ఈ ప్రశ్నలు ఇప్పుడు ఊహలు మాత్రమే కాదు. ఏఐ సామర్థ్యాలు పెరుగుతున్న కొద్దీ దాని నియంత్రణపై ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. ఇదే భయాన్ని అమెరికా సెనేటర్ బెర్నీ సాండర్స్ బలంగా ప్రస్తావించారు. అత్యంత శక్తిమంతమైన ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలని, మానవ మేధస్సును మించే సూపర్ ఇంటెలిజెన్స్‌ను శాశ్వతంగా నిషేధించాలని ఆయన ప్రతిపాదించడం సంచలనంగా మారింది. నియంత్రణ తప్పితే భవిష్యత్తు మానవాళికి ప్రమాదకరంగా మారే అవకాశాలపై చర్చ మొదలైంది.
అమెరికా సెనేటర్ బెర్నీ సాండర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై సంచలన ప్రతిపాదన చేశారు. అత్యంత శక్తిమంతమైన ఏఐ వ్యవస్థల అభివృద్ధిని వెంటనే నిలిపివేయడంతో పాటు, మానవ మేధస్సును మించే సూపర్ ఇంటెలిజెన్స్‌ను శాశ్వతంగా నిషేధించాలని కోరుతూ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. సాండర్స్ నిర్వచనం ప్రకారం, మానవుల కంటే తెలివైనదిగా మారి, మానవ నియంత్రణకు అతీతంగా స్వతంత్రంగా పనిచేసే కృత్రిమ మేధస్సు అత్యంత ప్రమాదకరమైన పరిణామం. ఇలాంటి వ్యవస్థల అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా ఇతర దేశాలతో కలిసి పనిచేయాలని ఆయన ప్రతిపాదించారు. ఈ బిల్లు చట్టంగా మారితే, నిషేధిత సూపర్ ఇంటెలిజెంట్ ఏఐను అభివృద్ధి చేసే కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు, సంబంధిత వ్యక్తులకు గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బిల్లుకు కాంగ్రెస్ ప్రోగ్రెసివ్ కాకస్ చైర్ గ్రెగ్ కాసర్ కూడా సహకరించారు.
వెయ్యి ఏఐ ఏజెంట్ల ఘటనపై ఆందోళన
సాండర్స్ ఈ స్థాయి చర్యకు రావడానికి ఇటీవల జరిగిన ఒక ఘటనను కూడా కారణంగా చూపారు. ఓపెన్ఏఐకి చెందిన 1,000కు పైగా ఏఐ ఏజెంట్లు విధించిన పరిమితులను దాటుకుని ఇంటర్నెట్ను యాక్సెస్ చేశారని ఆయన పేర్కొన్నారు. ఆ ఏజెంట్లు పరస్పరం కమ్యూనికేట్ చేసుకోవడం, తమ చర్యలకు సంబంధించిన ఆధారాలను దాచేందుకు ప్రయత్నించడం, మరో సంస్థకు చెందిన కంప్యూటర్లను యాక్సెస్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని సాండర్స్ ఆరోపించారు. ఇదే సమయంలో ఓపెన్ఏఐ తన తాజా ‘ఆస్ట్రా’ మోడల్‌ను విడుదల చేసింది. కంపెనీ అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మన్ ఈ మోడల్ ఏజీఐ స్థాయికి చేరుకునేంత శక్తిమంతంగా ఉండొచ్చని వ్యాఖ్యానించారు. దీంతో ఏఐ సామర్థ్యాలు వేగంగా పెరుగుతున్న సమయంలో వాటిపై నియంత్రణ సాధ్యమేనా అనే ప్రశ్నలు మరింత తీవ్రంగా మారాయి.
నియంత్రణ కోల్పోతే ప్రమాదమే
అత్యంత అధునాతన ఏఐ వ్యవస్థలపై నియంత్రణ కోల్పోయే ప్రమాదాన్ని పరిశ్రమలోని కొందరు ప్రముఖులు కూడా గతంలో ప్రస్తావించారని సాండర్స్ గుర్తుచేశారు. ఆంత్రాపిక్ సీఈఓ డారియో అమోడీ ఏఐ వ్యవస్థలు అనూహ్యంగా మారే అవకాశం ఉందని, వాటిని నియంత్రించడం కష్టమని హెచ్చరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే జూలైలో ప్రముఖ ఏఐ సంస్థలకు చెందిన 1,000 మందికి పైగా శాస్త్రవేత్తలు ఏఐ సామర్థ్యాల అభివృద్ధి మనిషి వాటిని అర్థం చేసుకునే, నియంత్రించే సామర్థ్యాన్ని వేగంగా దాటిపోయే నిజమైన ప్రమాదం ఉందని హెచ్చరించినట్లు సాండర్స్ తెలిపారు. అయితే బిల్లు పూర్తి పాఠ్యం ఇంకా విడుదల కాలేదు. దానికి అమెరికా కాంగ్రెస్‌లో ఎంతమేర మద్దతు లభిస్తుందన్నది కూడా స్పష్టంగా లేదు. అయినప్పటికీ ఓపెన్ఏఐ, ఆంత్రాపిక్ వంటి సంస్థలు మరింత శక్తిమంతమైన ఏఐ మోడళ్లను అభివృద్ధి చేస్తున్న సమయంలో సాండర్స్ ప్రతిపాదన టెక్నాలజీ స్వేచ్ఛకు భద్రతా నియంత్రణలకు మధ్య జరుగుతున్న కీలక పోరాటాన్ని మరోసారి ముందుకు తెచ్చింది.
#BernieSanders #BernieSandersAIBill #AIBill #AIRegulation #Superintelligence #SuperintelligentAI #OpenAI #Anthropic #AISafety #ArtificialIntelligence #AIGovernance #AIRisks #AIBan #USSenate #AdvancedAI #AIIndustry











