Home National_news పిల్లల స్క్రీన్‌కు కళ్లెం వేయాలి

పిల్లల స్క్రీన్‌కు కళ్లెం వేయాలి

ఆటలు, సృజనతో బాల్యాన్ని కాపాడాలి.
ఉపాధ్యాయులదే కీలక బాధ్యత.
ప్రధాని మోదీ టీచర్స్ డే సందేశం.

మొబైల్‌ స్క్రీన్‌లో మునిగిపోతున్న బాల్యం.. మైదానాల్లో కనిపించాల్సిన పిల్లలు చేతిలో ఫోన్లతో కాలం గడుపుతున్న పరిస్థితి.. మరోవైపు వ్యసనాల ఉచ్చులో చిక్కుకునే ప్రమాదం.. ఇవన్నీ భవిష్యత్‌ తరానికి ముప్పుగా మారుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు. పిల్లల చేతిలోని మొబైల్‌ను లాక్కోవడం కాదు.. వారి మనసును మరో మంచి ప్రపంచం వైపు మళ్లించాలన్నదే మోదీ ఆలోచన. ఆటలు, శారీరక వ్యాయామం, సృజనాత్మకత, ఆసక్తికరమైన కార్యకలాపాలతో పిల్లలను స్క్రీన్‌కు దూరం చేయాలని సూచించారు. మార్కుల వెనుక పరుగులు పెట్టించడం కంటే పిల్లల ప్రవర్తన, మానసిక స్థితి, రోజువారీ అలవాట్లను గమనించాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ వంటి వ్యసనాల విషయంలో చిన్న మార్పును కూడా నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరించారు. పిల్లల చేతిలో ఫోన్‌ ఉండాలా.. భవిష్యత్తు ఉండాలా? అన్న ప్రశ్నను ప్రతి తల్లిదండ్రి, ప్రతి టీచర్‌ ముందుంచినట్టుగా మోదీ సూచనలు నిలుస్తున్నాయి.

పిల్లల అతిగా స్క్రీన్‌ వినియోగం, డ్రగ్స్‌ వంటి సమస్యలపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. సెప్టెంబర్‌ 4న న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో 82 మంది జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలతో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పిల్లల చదువులో మార్కులు, అకడమిక్‌ పనితీరు మాత్రమే చూడకుండా వారి ప్రవర్తన, రోజువారీ జీవితం, మానసిక స్థితిపై కూడా ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ తగ్గిపోతున్న నేపథ్యంలో పిల్లల జీవితాల్లో టీచర్ల పాత్ర మరింత పెరిగిందని చెప్పారు. విద్యార్థుల్లో డ్రగ్స్‌ వినియోగానికి సంబంధించిన మార్పులు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలని, వ్యసనంతో ఇబ్బంది పడుతున్న వారికి సరైన మార్గదర్శనం అందించాలని కోరారు. బాల్యంలోని సహజమైన అమాయకత్వాన్ని కాపాడటం, పిల్లల్లో ఆసక్తి, జిజ్ఞాసను పెంచడం టీచర్ల బాధ్యత అని స్పష్టం చేశారు.

మొబైల్‌కు బదులు ఆటలు

పిల్లల్లో పెరుగుతున్న అతిగా స్క్రీన్‌ టైమ్‌ తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మోదీ పేర్కొన్నారు. పిల్లలు ఎంతసేపు మొబైల్‌, ఇతర స్క్రీన్‌లు చూస్తున్నారు? రాత్రి వేళల్లో కూడా ఫోన్‌ వాడుతున్నారా? అనే విషయాలను తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చించాలని సూచించారు. స్క్రీన్‌ వినియోగాన్ని ఒక్కసారిగా తగ్గించడం కంటే పిల్లలకు క్రీడలు, శారీరక ఆటలు, సృజనాత్మక కార్యక్రమాలపై ఆసక్తి పెంచడం ద్వారా క్రమంగా మొబైల్‌ అలవాటును తగ్గించవచ్చని చెప్పారు. పిల్లలను చదువుకే పరిమితం చేయకుండా వారి సహజ ప్రతిభను గుర్తించి వివిధ కార్యకలాపాల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. దీంతో శారీరక చురుకుదనం పెరగడంతో పాటు సృజనాత్మక ఆలోచన, సామాజిక నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

చదువుతో పాటు విలువలు

జాతీయ విద్యా విధానాన్ని ప్రస్తావించిన ప్రధాని.. పిల్లలను తరగతి గదులకే పరిమితం చేయకుండా వాస్తవ ప్రపంచంతో అనుసంధానం చేయాలని ఉపాధ్యాయులను కోరారు. పుస్తకాల్లోని సిలబస్‌ బోధించడమే విద్య కాదని, జీవితానికి అవసరమైన నైపుణ్యాలు, విలువలను కూడా విద్యార్థుల్లో పెంపొందించాలని సూచించారు. ముఖ్యంగా శ్రమకు గౌరవం అనే భావన చిన్ననాటి నుంచే పిల్లల్లో ఏర్పడేలా చూడాలని చెప్పారు. ఈ సమావేశంలో జాతీయ పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులు తమ బోధనా అనుభవాలు, వినూత్న విధానాలను ప్రధానికి వివరించారు. పురస్కార గ్రహీతల్లో పాఠశాల విద్యాశాఖకు చెందిన 48 మంది, ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్‌లకు చెందిన 21 మంది, నైపుణ్య శిక్షణ రంగానికి చెందిన 13 మంది ఉన్నారు. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో టీచర్‌ పాత్ర పాఠాలు చెప్పడంతో ముగియకూడదన్నదే ప్రధాని సందేశం.

 

#PMModi #NarendraModi #TeachersDay2026 #TeachersDay #PMModiMessage #ScreenTime #ChildrenScreenTime #ScreenAddiction #MobileAddiction #KidsHealth #SportsForChildren #Creativity #TeachersResponsibility #DrugAwareness #StudentWellbeing #EducationIndia #NationalTeachersAwards #NEP2020