త్వరలో అందుబాటులోకి కొత్త సేవలు
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ… ఈపీఎఫ్ఓ చందాదారులకు భారీ ఊరటనిచ్చేలా సరికొత్త డిజిటల్ వ్యవస్థను తీసుకువస్తోంది. ‘ఈపీఎఫ్ఓ 3.0’ పేరుతో రానున్న ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారా ఈ నెల చివరి నాటికి ఉద్యోగులు తమ పీఎఫ్ డబ్బును యూపీఐ యాప్‌లు, ఈపీఎఫ్-లింక్డ్ ఏటీఎంల ద్వారా నేరుగా విత్ డ్రా చేసుకునే వీలుంటుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా… ఎన్‌పీసీఐ భాగస్వామ్యంతో ఈ సాంకేతికతకు సంబంధించిన పరీక్షలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు.
విత్ డ్రా పరిమితి వివరాలు
కొత్త నిబంధనల ప్రకారం చందాదారులు అత్యవసర పరిస్థితుల్లో తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్ నుండి గరిష్టంగా 75 శాతం వరకు నగదును తక్షణమే పొందే అవకాశం కల్పిస్తున్నారు. మిగిలిన 25 శాతం నిధిని భవిష్యత్తు సామాజిక భద్రత కోసం తప్పనిసరిగా ఖాతాలోనే ఉంచుతారు. గతంలో పీఎఫ్ డబ్బులు చేతికి రావడానికి దరఖాస్తు చేసుకుని రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త విధానం వల్ల ఎలాంటి కాగితపు పని లేకుండా, మధ్యవర్తుల అవసరం లేకుండా పారదర్శకంగా, వేగంగా నగదు నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది.
పెరిగిన ఆటో సెటిల్మెంట్
ఈపీఎఫ్ఓ 3.0 అప్‌డేట్‌లో భాగంగా ప్రభుత్వం క్లెయిమ్‌ల ఆటో సెటిల్మెంట్ పరిమితిని భారీగా పెంచింది. గతంలో ఉన్న రూ. 1 లక్ష పరిమితిని ఏకంగా రూ. 5 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఎక్కువ మొత్తంలో పీఎఫ్ క్లెయిమ్ చేసుకునే వారికి వేగంగా సేవలు అందుతాయి. దీంతో పాటు ఉమాంగ్ యాప్ ద్వారా ముఖ గుర్తింపు సాంకేతికతను… ఫేస్ అథెంటికేషన్ ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల చందాదారులు తమ గుర్తింపును నిరూపించుకోవడానికి అనేక రకాల పత్రాలను సమర్పించాల్సిన అవసరం తప్పుతుంది.
ఖాతాదారులకు డిజిటల్ ప్రయోజనాలు
ఈ సరికొత్త అప్‌డేట్ వల్ల కేవలం నగదు విత్‌డ్రాయే కాకుండా ఇతర సేవలు కూడా సులభతరం కానున్నాయి. యూనివర్సల్ అకౌంట్ నంబర్ యాక్టివేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. చందాదారులు తమ పీఎఫ్ పాస్‌బుక్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా చూసుకోవచ్చు. ఖాతాలోని వ్యక్తిగత వివరాల సవరణలు కూడా వేగంగా పూర్తవుతాయి. పీఎఫ్ పొదుపు అనేది ఉద్యోగుల అతిపెద్ద ఆర్థిక ఆస్తి కాబట్టి, అత్యవసర సమయాల్లో ఈ సేవలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే ఈ సౌకర్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు.











