తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రజలకు కీలక హామీలు ఇచ్చారు. తమ పార్టీని గెలిపిస్తే రైతును నిజమైన రాజుగా నిలబెడతానని ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పడితే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రైతుకు ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేసి గౌరవం కల్పిస్తామని చెప్పారు. అన్న రాజ్యం కాదు, అక్క రాజ్యం ఎలా ఉంటుందో ప్రజలకు చేసి చూపిస్తానని పేర్కొన్నారు. కొత్త పార్టీ కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతుందని, ‘పాంచజన్యం’ పేరుతో ప్రజా ఉద్యమాన్ని విస్తరిస్తామని వెల్లడించారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించానని కవిత తెలిపారు. త్వరలోనే ఆ ప్రణాళికను ప్రజలకు ప్రకటిస్తామని చెప్పారు. సమాజంలో మహిళల పాత్రను మరింత బలోపేతం చేసే విధంగా కార్యక్రమాలు అమలు చేస్తామని పేర్కొన్నారు. మహిళలకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు. కొత్త రాజకీయానికి మహిళలే బలమైన శక్తిగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
గిరిజన సమస్యలపై పోరాటం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కొత్త గంగారం గ్రామం, నాయకపోడు గిరిజన ప్రాంతాలను సందర్శించిన కవిత అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రాజకీయాల కోసం కాదని, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే తాను గ్రామాలకు వస్తున్నానని చెప్పారు. వెనుకబడిన గిరిజనుల హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేశానని వివరించారు. గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఢిల్లీ వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. నాయకపోడు గిరిజనులను ‘గోండు నాయకపోడు’గా పిలవడం బాధాకరమని కవిత అన్నారు. 1950 రికార్డుల్లో నాయకపోడు జాతి పేరు లేకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. గిరిజనులకు పూర్తి గుర్తింపు, హక్కులు కల్పించేందుకు నిరంతర పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
రుణాలు, విద్యపై డిమాండ్లు
ఆదివాసీ యువతకు బైక్ కొనాలన్నా బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని కవిత ఆరోపించారు. పెద్ద ఎత్తున రుణాలు తీసుకున్న వారిని ఆదుకున్న ప్రభుత్వాలు గిరిజనులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. విదేశాల్లో ఉన్న విధానాల మాదిరిగా ఆదివాసీలకు రూ.2 లక్షల నుంచి రూ.2 కోట్ల వరకు బ్యాంకు రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. గిరిజన పిల్లలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. తెలంగాణలో ఇప్పటికీ నిరుద్యోగం, విద్యుత్ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాలేదని కవిత విమర్శించారు. ఎస్టీల కోసం కేటాయించిన వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లిస్తోందని ఆరోపించారు. రైతులు, మహిళలు, గిరిజనులు కేంద్రంగా రాజకీయాలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రక్షణ సేనను బలోపేతం చేసి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలబెడతామని కవిత తెలిపారు.











