ఉచిత ప్రవేశాల నిబంధనలపై వ్యూహరచన.
16 మందితో రాష్ట్రస్థాయిలో కార్యాచరణ.
ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు 25 శాతం ఉచిత ప్రవేశాల అమలుపై నిబంధనలను సమీక్షించేందుకు ఏపీ ప్రభుత్వం 16 మంది సభ్యులతో రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. విద్యాహక్కు చట్టం 2009లోని సెక్షన్ 12(1)(సి) ప్రకారం అమలవుతున్న ప్రస్తుత మార్గదర్శకాలను ఈ కమిటీ పరిశీలించనుంది. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జి. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ షమీమ్ అన్సారియా కమిటీకి ఛైర్‌పర్సన్‌గా, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. విద్యాశాఖ అధికారులు, డీఈవో, ఎంఈవో, న్యాయ సలహాదారులు, ఎన్జీవో, ప్రైవేట్ స్కూళ్ల సంఘం ప్రతినిధులతో పాటు ఈ చట్టం కింద ప్రవేశం పొందిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు.
పారదర్శక ప్రవేశాలే లక్ష్యం
కమిటీ ఆర్టీఈ చట్టం, ఏపీ ఆర్టీఈ నిబంధనలు, జనవరి 13న సుప్రీంకోర్టు తీర్పు, ఎన్సీపీసీఆర్ మార్గదర్శకాలను సమగ్రంగా అధ్యయనం చేయనుంది. ఉచిత సీట్ల భర్తీ ప్రక్రియలో పారదర్శకత కోసం ఆన్లైన్ ప్రవేశాలు, అందుబాటులో ఉన్న సీట్ల వివరాల వెల్లడికి కొత్త విధానాలను సూచించనుంది. విద్యార్థులకు సంబంధించిన ఫీజుల రీయింబర్స్‌మెంట్‌పై కూడా సిఫారసులు చేయనుంది. ప్రస్తుతం చట్టం అమలులో ఎదురవుతున్న ప్రాక్టికల్, న్యాయపరమైన సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను సూచించడం కమిటీ ప్రధాన బాధ్యత. ఉచిత ప్రవేశాలు పొందిన పిల్లలపై ప్రైవేట్ పాఠశాలల్లో ఎలాంటి వివక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకునే విధానాలను కూడా ప్రతిపాదించనుంది. ఇదిలా ఉండగా రాష్ట్ర అక్షరాస్యతను 2027 సెప్టెంబర్ నాటికి 100 శాతానికి చేర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం పాఠశాలలకు దూరంగా ఉన్న 1.64 లక్షల మంది పిల్లల్లో ప్రతి ఒక్కరినీ గుర్తించి విద్యలో చేర్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.
#APPrivateSchools #RTEAdmissions #FreeAdmissions #25PercentSeats #AndhraPradesh #APSchoolEducation #RTEAct #RightToEducation #PrivateUnaidedSchools #FreeEducation #APGovernment #EducationCommittee #RTE2026 #FeeReimbursement #OnlineAdmissions #StudentRights #EducationNews











