వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి డీఎస్సీ–2025 నియామకాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన, నిరుద్యోగ యువత అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం హింసతో సమాధానం చెబుతోందని ఆరోపించారు. ప్రశ్నాపత్రం లీకేజీ, నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ విజయవాడలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షపై అధికార పార్టీ ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని మండిపడ్డారు.
దీక్షా శిబిరాలపై దాడులా?
పోలీసుల సమక్షంలోనే దీక్షా శిబిరాలను ధ్వంసం చేశారని జగన్ ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో పాటు నిరుద్యోగ యువతపై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారని పేర్కొన్నారు. మహిళలపై కూడా దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. చిలకలూరిపేట, కనిగిరి, యాడికి, తాడిపత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, మాచర్ల, గురజాల, కందుకూరు, బాపట్ల తదితర ప్రాంతాల్లో నిరసన శిబిరాలపై నిర్బంధ చర్యలు కొనసాగాయని ఆరోపించారు.
లోకేష్ రాజీనామాకు డిమాండ్
డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం చెబుతున్నట్లయితే సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతోందని జగన్ ప్రశ్నించారు. నియామకాల్లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రూ.9,000 కోట్లకు చేరిన విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎన్నికల హామీ ప్రకారం నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని రెండేళ్ల బకాయిలతో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు.
పోరాటం కొనసాగుతుంది…
దీక్షా శిబిరాలను ధ్వంసం చేయొచ్చు, నిరసనకారులను అరెస్టు చేయొచ్చని, కానీ డీఎస్సీ లీకేజీ, అక్రమాలపై ఉన్న ఆధారాలను చెరిపేయలేరని జగన్ అన్నారు. నిరుద్యోగ యువతలో ఉన్న ఆగ్రహాన్ని అణచివేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని, ఆంధ్రప్రదేశ్ యువత గొంతును ఎవరూ మూయలేరని తన ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు.
#JaganMohanReddy #DSC2025 #DSCRecruitment #DSCControversy #CBIProbe #PaperLeak #UnemployedYouth #APPolitics #NaraLokesh #YSRCP #Vijayawada #Protest #RelayHungerStrike #AndhraPradesh #DSCProtests











