Home AP కొత్త పింఛన్లకు గ్రీన్‌సిగ్నల్‌!

కొత్త పింఛన్లకు గ్రీన్‌సిగ్నల్‌!

స్థానిక ఎన్నికలపై లోకేశ్‌ కీలక ఆదేశాలు.
అర్హులందరికీ దశలవారీగా పింఛన్లు.

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ దశలవారీగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్హులకు పింఛన్లు అందించాలని మంత్రులకు సూచించారు. కేబినెట్‌ సమావేశానికి ముందు మంత్రులతో భేటీ అయిన లోకేశ్‌ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అక్టోబర్‌లోగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందని, వాయిదా పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సమస్యలను త్వరగా పరిష్కరించి అన్ని స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. తొలుత పురపాలక ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ, చివరగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేలా పార్టీ శ్రేణులు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికలు ఆలస్యమైతే ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు నిలిచిపోయి రాష్ట్రానికి నష్టం కలిగేలా ప్రతిపక్షం కుట్రలు చేస్తోందని లోకేశ్‌ ఆరోపించారు.

అధికారుల పనితీరుపై అప్రమత్తం

విద్యాశాఖను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని లోకేశ్‌ మంత్రులకు సూచించారు. మాట వినని అధికారులు, శాఖకు లేదా మంత్రికి చెడ్డపేరు వచ్చేలా వ్యవహరించే అధికారుల విషయంలో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటీవల కొన్ని సమస్యలు ఒకరిద్దరు అధికారుల పనితీరు కారణంగానే ఏర్పడ్డాయని అభిప్రాయపడ్డారు. వైద్య రంగంలో చిన్న పొరపాటు జరిగినా సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ట్రోలింగ్‌ జరుగుతోందని, ఇలాంటి అంశాలపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సెప్టెంబర్‌ 9న చంద్రబాబుపై అక్రమ కేసులు, అన్యాయ నిర్బంధానికి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. అప్పటి పరిణామాల నుంచి ప్రభుత్వం ఎదుర్కొన్న సవాళ్లు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తీరును ప్రజలకు వివరించేలా కార్యక్రమం ఉండాలని చెప్పారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి కొరత వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికలు, నీటి పొదుపు చర్యలు చేపట్టి సమస్యను ఎదుర్కోవాలని లోకేశ్‌ సూచించారు.

 

#APNewPensions #NaraLokesh #AndhraPradesh #APPensions #PensionScheme #PensionBeneficiaries #LocalBodyElections #APLocalElections #MunicipalElections #MPTCElections #ZPTCElections #PanchayatElections #APGovernment #ChandrababuNaidu #APPolitics #CoalitionGovernment