ఒంటిమిట్టలో జోరందుకున్న ప్రచారం!
మావిళ్లకు ముప్పేట మద్దతు..
అభివృద్ధికి పట్టం కట్టాలంటున్న గ్రామస్థులు
కడప జిల్లా ఒంటిమిట్టలో సర్పంచి ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీ బలపరుస్తున్న సర్పంచి అభ్యర్థి మావిళ్ల ఈశ్వరయ్యకు గ్రామస్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రచారానికి వెళ్లిన ప్రతిచోటా ఘనస్వాగతం పలుకుతున్నారు. దీంతో తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గ్రామంలోని సీనియర్ తెదేపా నాయకులు ఈశ్వరయ్యకు అండగా నిలుస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నికల బరిలో అభ్యర్థికి మద్దతుగా స్థానిక నాయకులంతా ఒక్కతాటిపైకి రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
కడప జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య బావమరిది పామూరు సుబ్రమణ్యం, మాజీ ఎంపీటీసీ ఓబినేని సుబ్బమ్మ తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు. అభ్యర్థి వెంట నడుస్తూ ఓటర్లను కలుస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్సీ, జోనల్ కోఆర్డినేటర్ దీపక్‌రెడ్డి సైతం ప్రచార సరళిపై ఆరా తీసినట్లు సమాచారం. దీంతో స్థానిక తెదేపా శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. గ్రామంలోని రాజకీయ సమీకరణాలపై పార్టీ నేతలు దృష్టి సారించారు. ప్రచారంలో భాగంగా నాయకులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుస్తున్నారు.
ఒంటిమిట్ట కోదండరామాలయం పరిసరాల నుంచి ప్రారంభమైన ప్రచారం కడప-చెన్నై ప్రధాన రహదారి వెంబడి కొనసాగింది. స్థానికులతో కలిసి టీ తాగుతూ గ్రామ సమస్యలు, అభివృద్ధి అవసరాలపై చర్చించారు. సర్పంచి అభ్యర్థి మావిళ్ల ఈశ్వరయ్యతో పాటు కొమరా వెంకట నరసయ్య, పామూరు సుబ్రమణ్యం ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు. గ్రామానికి ఏం చేయాలి? ప్రాధాన్యంగా పరిష్కరించాల్సిన సమస్యలేమిటి? అనే అంశాలపై వారి సూచనలు స్వీకరించారు. మొత్తంగా మావిళ్ల ఈశ్వరయ్యకు లభిస్తున్న స్థానిక మద్దతు, సీనియర్ నాయకుల అండతో ఒంటిమిట్టలో ఎన్నికల సందడి నెలకొంది.











