Home AP ఏపీలో భారీ పెట్టుబడులు.. కొత్త పరిశ్రమలు.. ఉద్యోగాల జాతర

ఏపీలో భారీ పెట్టుబడులు.. కొత్త పరిశ్రమలు.. ఉద్యోగాల జాతర


రూ.2.08 లక్షల కోట్లకు గ్రీన్ సిగ్నల్.
సీఎం అధ్యక్షతన ఎస్‌ఐపీబీ సమావేశం.


ఆంధ్రప్రదేశ్‌లో భారీ పారిశ్రామిక పెట్టుబడులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 25 ప్రాజెక్టులకు రూ.2,08,406 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 21,627 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. డిసెంబరు నుంచి పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 ఎస్ఐపీబీ సమావేశాల్లో 363 ప్రాజెక్టులకు రూ.13.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించగా.. 10.86 లక్షల ఉద్యోగాల కల్పనకు మార్గం ఏర్పడిందని ప్రభుత్వం తెలిపింది.

గ్రీన్ ఎనర్జీ నుంచి ఏఐ వరకు

రాష్ట్ర పారిశ్రామిక భవిష్యత్తులో కొత్త తరహా రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు సూచించారు. గ్రీన్ అమ్మోనియా, లిథియం బ్యాటరీలు, రోబోటిక్స్, డేటా సెంటర్లు, ఏఐ, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించాలని ఆదేశించారు. విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాల్లో భారీ డేటా సెంటర్ ప్రాజెక్టులు.. తిరుపతి ప్రాంతంలో లిథియం బ్యాటరీ ప్రాజెక్టులు.. కడప కొప్పర్తి క్లస్టర్‌లో ఎలక్ట్రానిక్స్ పెట్టుబడులు రానున్నాయి. ఉత్తరాంధ్రలో డేటా సెంటర్లపై ఉన్న అపోహలను తొలగించి ప్రజలకు వాస్తవాలు వివరించాలని సీఎం సూచించారు. రక్షణ, ఏరోస్పేస్ ప్రాజెక్టులను కూడా వేగంగా తీసుకురావాలని ఆదేశించారు.

గ్రామాలకు పరిశ్రమలు.. యువతకు ఉద్యోగాలు

పెట్టుబడులు కేవలం నగరాలకే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందేలా పరిశ్రమలను విస్తరించాలని సీఎం స్పష్టం చేశారు. సెప్టెంబరు నాటికి మిగిలిన 37 ఎంఎస్ఎంఈ పార్కులను పూర్తి చేసి 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలు అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రాయలసీమ ఉద్యాన ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లు అందేలా రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ పెంచాలని సూచించారు. లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, కోల్డ్‌చైన్ రంగాలను అనుసంధానించాలని చెప్పారు. పెట్టుబడి రావడం మాత్రమే కాదు.. అది స్థానిక యువతకు ఉద్యోగం, రైతులకు మార్కెట్, గ్రామాలకు మౌలిక వసతులు తెచ్చినప్పుడే పారిశ్రామిక ప్రగతికి నిజమైన అర్థం ఉంటుందన్నదే తాజా నిర్ణయాల అసలు లక్ష్యం.

 

#APIndustrialInvestments #AndhraPradesh #ChandrababuNaidu #SIPB #APInvestments #IndustrialDevelopment #NewIndustries #JobCreation #APJobs #GreenEnergy #DataCenters #LithiumBatteries #AI #Robotics #Electronics #MSME #AndhraPradeshNews #APDevelopment