Home Telangana బార్ కౌన్సిల్‌కు అంత సీన్ లేదు విద్యార్థులను శిక్షించే అధికారం లేదు

బార్ కౌన్సిల్‌కు అంత సీన్ లేదు విద్యార్థులను శిక్షించే అధికారం లేదు

లా విద్యార్థులపై బీసీఐ పవర్‌‌పై స్పష్టత.
మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.

లా విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అడ్వకేట్స్‌ యాక్ట్‌–1961 కింద బీసీఐకి ఉన్న క్రమశిక్షణాధికారాలు కేవలం నమోదైన న్యాయవాదులకే పరిమితమని తేల్చిచెప్పింది. నల్సార్‌ లా యూనివర్సిటీకి చెందిన ఇద్దరు మాజీ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ కీలక తీర్పు వెలువడింది. 2026 బ్యాచ్‌ విద్యార్థుల స్నాతకోత్సవానికి సీజేఐని ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. దీనిపై బీసీఐ నల్సార్‌ యాజమాన్యాన్ని విచారణకు ఆదేశిస్తూ లేఖలు పంపింది. విద్యార్థులను అడ్వకేట్లుగా ప్రొఫెషనల్‌ ఎన్‌రోల్‌మెంట్‌కు అనుమతించకుండా రాష్ట్ర బార్‌ కౌన్సిళ్లను ఆదేశించే ప్రయత్నం కూడా చేసింది. ఈ చర్యలు విద్యార్థుల భావ ప్రకటన స్వేచ్ఛ, సంఘటితమయ్యే హక్కుపై భయపెట్టే ప్రభావం చూపుతున్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.

వెనక్కి తీసుకున్న లేఖలు.. ముగిసిన వివాదం

విచారణ సందర్భంగా బీసీఐ చైర్మన్‌ మానన్‌ కుమార్‌ మిశ్రా కోర్టుకు హాజరై కీలక వివరణ ఇచ్చారు. నల్సార్‌ విద్యార్థులపై విచారణకు ఆదేశించిన లేఖలను, విద్యార్థులను ఎన్‌రోల్‌మెంట్‌ నుంచి అడ్డుకోవాలని రాష్ట్ర బార్‌ కౌన్సిళ్లకు పంపిన లేఖలను వెంటనే ఉపసంహరించుకున్నామని తెలిపారు. దీంతో ఇక తదుపరి చర్య అవసరం లేదని ఆయన కోర్టుకు వెల్లడించారు. ఈ లేఖలు ప్రస్తుతం అమల్లో లేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా బీసీఐ అధికార పరిధిపై కోర్టు ఇచ్చిన స్పష్టత దేశవ్యాప్తంగా లా విద్యార్థుల హక్కులకు ప్రాధాన్యతనిచ్చే కీలక నిర్ణయంగా మారింది. లా విద్యార్థులపై శిక్షాత్మక చర్యలు తీసుకునే అధికారం బీసీఐకి లేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చడంతో విద్యార్థుల స్వేచ్ఛ, విద్యాసంస్థల స్వయం ప్రతిపత్తిపై చర్చకు తెరలేచింది.

#BarCouncilOfIndia #BCI #SupremeCourt #LawStudents #BCIPowers #NALSAR #SupremeCourtVerdict #AdvocatesAct1961 #LawStudentRights #LegalEducation #StudentRights #IndianJudiciary