Home Special Stories మాటలు.. మంటలు. కాంట్రవర్సీ కామెంట్.. వార్నింగ్‎లతో వైలెంట్

మాటలు.. మంటలు. కాంట్రవర్సీ కామెంట్.. వార్నింగ్‎లతో వైలెంట్

57

పవన్ పంచ్ డైలాగ్.. ప్రత్యర్థులు కౌంటర్ అటాక్

అగ్నికి వాయువు తోడైతే దావానలం వ్యాపిస్తుందనే నానుడిని నిజం చేస్తూ ప్రస్తుతం జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మాటలతో రెండు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్రమైన మంటలు పుట్టిస్తున్నారు. పేరులో పవన్ అని ఉన్నందువల్లనేమో కానీ ఆయన చేస్తున్న తాజా కామెంట్లు నిత్యం కొత్త వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నాయి. అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో తన ఉనికిని బలంగా చాటుకునేందుకు పవన్ కళ్యాణ్ ఆరంభంలో ఉన్నంత వేగంతో దూసుకుపోతున్నారు.

వైసీపీ నేతలకు డిప్యూటీ సీఎం ఘాటు హెచ్చరిక
తాము మళ్లీ అధికారంలోకి వస్తామంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇస్తున్న వరుస వార్నింగ్స్‌తో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇపుడు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తానని చెప్పడంపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. ఇప్పుడు అదే తరహాలో ఫ్యాన్ పార్టీ నాయకులు కూడా తాము భవిష్యత్తులో అధికారంలోకి రాగానే అందరి పేర్లు నోట్ చేసుకుని లెక్కలు తేలుస్తామని కుండబద్ధలుకొడుతున్నారు. అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు పేల్చుతున్న మాటల బాంబులు రాష్ట్రంలో కొత్త రాజకీయ రచ్చకు తెరదీశాయి. ఈ పరస్పర విమర్శలు, ప్రతివిమర్శల నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ హెచ్చరిక రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. తాను ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి వైసీపీ నేతలను తీవ్రంగా హెచ్చరిస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఒకవేళ వైసీపీ పొరపాటున అధికారంలోకి వచ్చినా, ఒకవేళ వాళ్లు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రెచ్చిపోతే మాత్రం వారిని తొక్కి నారతీస్తానని హెచ్చరించడం ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపింది. కేవలం అధికార పీఠాన్ని చూసి ప్రత్యర్థులతో తలపడబోనని, ప్రతిపక్షంలో ఉన్నా తన నైజం అస్సలు మారదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ తాటాకు చప్పుళ్లు కేవలం వైసీపీ నాయకులపైనేనని… అసలు తప్పు చేసిన పెద్ద వారిపై మాత్రం చూపించారన్న భావనను ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

పవర్ పంచ్‌లతో సాగుతున్న జనసేన పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అవలంబించే శైలి ఎప్పుడూ సంచలనంగానే మారుతుంది. గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు “చెప్పు చూపిస్తా”, “పంచాలూడదీసి కొడతా” అంటూ తీవ్ర ఆవేశంతో ఊగిపోయారు. ఇప్పుడు అధికారంలో ఉంటూనే “తొక్కి నార తీస్తా.. నేనేంటో చూపిస్తా” అంటూ చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఒక వైపు కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన డిప్యూటీ సీఎం పదవిలో ఉంటూ… తీవ్రమైన భాషను ఉపయోగించడం ఇపుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ప్రత్యర్థులకు ఆయన ఇస్తున్న రాజకీయ హెచ్చరికా? లేక జనసేన క్యాడర్‌లో కొత్త జోష్ నింపే వ్యూహమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జగన్ వర్సెస్ చంద్రబాబుగా సాగిన ఏపీ రాజకీయాన్ని పవన్ కళ్యాణ్ పూర్తిగా తన వైపు తిప్పుకునేందుకు ఇదంతా చేస్తున్నారా అన్న సందేహం రాజకీయ వర్గాల్లో బలంగా కలుగుతోంది. అయితే ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తూ, నెంబర్ 2 పొజిషన్లో ఉన్న ఒక బాధ్యతాయుతమైన నాయకుడు ఇలాంటి అడుగులు వేయడం రాజకీయ సంయమన లోపమా, లేక వ్యవస్థను ప్రశ్నించే ఆయన పాత నైజమా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

వరుస కామెంట్లు… చూపంతా హోం శాఖపైనేనా?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధాలు కొత్తవి కావు. అధికార, ప్రతిపక్ష పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకోవడం, ఒకరిపై మరొకరు రాజకీయ ఆరోపణలు చేయడం, సోషల్ మీడియా వేదికగా ప్రచార యుద్ధాలు సాగించడం ఇపుడు దాదాపు నిత్యకృత్యంగా మారిపోయింది. అయితే కొన్ని సందర్భాల్లో ఒకే ఒక్క వ్యాఖ్య రాజకీయ చర్చల దిశనే పూర్తిగా మార్చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో అలాంటి చర్చకు కేంద్రబిందువుగా మారింది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన తాజా వ్యాఖ్య. ఇన్నాళ్లు తాను ఏం మాట్లాడలేదని, ఇపుడు కెమెరా ముందు స్పష్టంగా చెప్తున్నానని పవన్ అన్నారు. భవిష్యత్తులో వైసీపీ ప్రభుత్వం వచ్చినా సరే మిమ్మల్ని తొక్కి నార తీస్తానని, ఇంకా మూడేళ్లు టైం ఉందని, అప్పటివరకు నేనేంటో చూపిస్తా అంటూ ఆయన చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ రాజకీయ రచ్చ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ హోం శాఖ గురించి పదేపదే ప్రస్తావించడం సరికొత్త వివాదానికి ఆజ్యం పోసింది. ఇప్పటికే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ గురించి మాట్లాడుతూ హోం శాఖ తన చేతిలో లేదన్నట్టుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. ఇప్పటికి మూడు సార్లు ఇదే విషయాన్ని బహిరంగ వేదికలపై ప్రస్తావించడం కూటమి ప్రభుత్వంలో అంతర్గత విభేదాలను సూచిస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హోం శాఖ తన వద్ద లేకపోయినప్పటికీ, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని, జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయినా, అరాచక శక్తులను వదిలేదే లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినా సరే తప్పు చేసిన వారిని తొక్కి నారదీస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి.

ఉద్యమ పార్టీ నుండి అధికార పక్షంగా ప్రస్థానం
జనసేన తొలి దశలో ఒక సాధారణ ఉద్యమ పార్టీగా కనిపించినా, సంస్థాగత బలం మాత్రం మొదట్లో పరిమితంగానే ఉండేది. అయినప్పటికీ పవన్ వ్యక్తిగత ఆకర్షణ, అభిమాన వర్గం, యువతలో ఉన్న విపరీతమైన ఆదరణ పార్టీకి పెద్ద ఎత్తున గుర్తింపును తెచ్చిపెట్టాయి. రాజకీయంగా పార్టీ ఎదుగుదల నెమ్మదిగా సాగినా, పవన్ కళ్యాణ్ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ చర్చలకు కేంద్రంగా నిలిచారు. 2019 ఎన్నికలు పవన్ రాజకీయ జీవితంలో ఒక పెద్ద మలుపుగా నిలిచాయి. ప్రజాదరణ ఉన్నప్పటికీ అది ఓట్లుగా మారకపోవడంతో ఆయన ఓటమిని ఎదుర్కొన్నారు. రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన ఆయన రెండింటిలోనూ పరాజయం మూుటగట్టుకున్నారు. రాజకీయ ప్రత్యర్థులు ఇది జనసేన భవిష్యత్తుపై ప్రశ్నార్థకమైన అనేక ఊహాగానాలకు తెరలేపారు. అయితే ఆ ఘోర ఓటమి పవన్‌ కళ్యాణ్ ను ఏమాత్రం వెనక్కి నెట్టలేదు. దానికి విరుద్ధంగా మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళ్లేలా చేసింది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శలు, నిరసనలు, ఉద్యమాలు మరింత పెరిగాయి. రోడ్లపై గుంతలు, రైతు సమస్యలు, ఉద్యోగాలు, మహిళల భద్రత, పరిపాలన, అభివృద్ధి వంటి అనేక ప్రజా సమస్యలపై ఆయన నిరంతరం స్పందించారు. ఈ కాలంలోనే వైసీపీ-జనసేన మధ్య రాజకీయ దూరం మరింత పెరిగింది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వ హయాంలో ఒక బహిరంగ వేదికపై నుంచి చెప్పు చూపించిన నిరసన ఘటన రాష్ట్రవ్యాప్తంగా పెద్ద వివాదానికి దారి తీసింది. అది సాధారణ రాజకీయ విమర్శ కంటే ప్రతీకాత్మక నిరసనగా మారింది.

జనసేన భవిష్యత్తుకు అసలైన పరీక్ష
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను కూడా రెండు విభిన్న కోణాల్లోనే విశ్లేషిస్తున్నారు. ఒక వర్గం దీనిని పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన ధైర్య సందేశంగా చూస్తోంది. మరో వర్గం రాజకీయ ప్రత్యర్థులపై చేసిన తీవ్ర హెచ్చరికగా భావిస్తోంది. అయితే ఈ వివాదంలో అత్యంత ఆసక్తికరమైన అంశం వైసీపీ ప్రతిస్పందనే. చాలా కాలంగా ప్రధాన రాజకీయ పోరు కేవలం చంద్రబాబు-జగన్ మధ్యనే సాగింది. కానీ ఇప్పుడు పవన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ నేతల దృష్టి గణనీయంగా జనసేన వైపు మళ్లినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. పలువురు వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు నేరుగా కౌంటర్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పవన్ వ్యాఖ్యలపై విస్తృత చర్చ సాగుతోంది. ఇక జనసేన భవిష్యత్తు విషయానికి వస్తే, పార్టీ ఇప్పుడు అత్యంత కీలకమైన దశలో ఉంది. ఉద్యమ పార్టీ నుంచి పాలనా భాగస్వామిగా మారిన తర్వాత పార్టీపై ప్రజల అంచనాలు పూర్తిగా మారిపోయాయి. ఇకపై కేవలం ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం మాత్రమే సరిపోదు. పాలనలో స్పష్టమైన ఫలితాలు చూపించాలి. సంస్థాగతంగా పార్టీని గ్రామ స్థాయి నుండి బలోపేతం చేయాలి. పవన్ కళ్యాణ్‌కు ఉన్న వ్యక్తిగత ప్రజాదరణను పార్టీ ఓటు బ్యాంకుగా మార్చాలి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా కేవలం ఒక ఉద్యమ నాయకుడి స్థాయి నుంచి బాధ్యతాయుతమైన పాలనా నాయకుడిగా మారే ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.

 

#PawanKalyan #JanaSena #AndhraPolitics #APPolitics #YSRCP #YSJagan #DeputyCM #PoliticalWar #PoliticalHeat #JanasenaPolitics #PawanComments #PoliticalControversy #KTR #JagadishReddy #TelanganaPolitics #CoalitionGovernment #HomeDepartment #PoliticalAnalysis #PoliticalDebate #BreakingNews #TeluguPolitics #PawanWarning #APNews #PoliticalStrategy #JanasenaChief