Home Telangana వాట్ నెక్స్ట్ సర్‌జీ ఓటర్లలో టెన్షన్‌ టెన్షన్

వాట్ నెక్స్ట్ సర్‌జీ ఓటర్లలో టెన్షన్‌ టెన్షన్


తెలంగాణలో ముగిసిన ‘సర్’ ప్రక్రియ
74 లక్షల ఓట్లపైనే అందరి ఫోకస్

తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ఎన్యూమరేషన్‌ ప్రక్రియ ముగియడంతో అసలు కథ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా 74 లక్షలకు చేరువగా ఉన్న ఓటర్ల పరిస్థితిపై ఇప్పుడు రాజకీయ వర్గాలు, ఎన్నికల యంత్రాంగం దృష్టి సారించాయి. ఫారాలు సమర్పించని వారు, ఏఎస్‌డీ కేటగిరీలో ఉన్న వారి పేర్లు ముసాయిదా జాబితాలో ఎలా ఉంటాయన్నది కీలకంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో తక్కువ డిజిటలైజేషన్‌ నమోదవడం ఆసక్తి రేపుతోంది. ఆగస్టు 17న విడుదలయ్యే ముసాయిదా జాబితాతో సర్‌ ప్రక్రియలో అసలు ప్రభావం స్పష్టమయ్యే అవకాశం ఉంది. పేరు గల్లంతైతే క్లెయిమ్‌, అభ్యంతరాల ద్వారా తిరిగి అవకాశం ఉంటుందా? ఎవరెవరి పేర్లు తొలగుతాయి? ఎవరికి ఊరట లభిస్తుంది? ఇప్పుడు ఇదే తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.



తెలంగాణలో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ఎన్యూమరేషన్‌ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,38,26,448 ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేయగా, 2,64,73,616 ఫారాలు సమర్పించి డిజిటలైజ్‌ చేసినట్లు తాజా అధికారిక స్థితిగతులు వెల్లడించాయి. మిగిలిన 73,52,832 మంది ఓటర్లు ఫారాలు సమర్పించని వారు లేదా ‘అబ్సెంట్‌, షిఫ్టెడ్‌, డెడ్‌’ (ఏఎస్‌డీ) కేటగిరీలో ఉన్నవారిగా పరిగణించనున్నారు.

ఆగస్టు 17న జాబితా, అప్పటి వరకు ఛాన్స్

రాష్ట్రవ్యాప్తంగా ఫారాల డిజిటలైజేషన్‌ 78.26 శాతం నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే యాదాద్రి భువనగిరి 94.31 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ మాత్రం 58.89 శాతంతో చివరి స్థానంలో ఉంది. మేడ్చల్‌–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోనూ డిజిటలైజేషన్‌ శాతం తక్కువగానే నమోదైంది. ఎన్యూమరేషన్‌ గడువు ముగిసినా ఓటర్లకు ప్రక్రియ పూర్తైనట్లే కాదు. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. అందులో తమ పేరు ఉందో లేదో ప్రతి ఓటరూ పరిశీలించాల్సి ఉంటుంది. పేరు లేకపోయినా, వివరాల్లో తప్పులున్నా నిర్ణీత గడువులో అభ్యంతరాలు, క్లెయిమ్‌లు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించనున్నారు. అనంతరం పరిశీలన పూర్తిచేసి అక్టోబర్‌ 19న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. అందువల్ల ఫారం సమర్పించలేకపోయిన వారు, ASD కేటగిరీలో ఉన్నట్లు భావిస్తున్న వారు ముసాయిదా జాబితా విడుదలైన వెంటనే తమ ఓటు హక్కును పరిశీలించుకోవడం కీలకం.

#TelanganaSIR #SIREnumeration #TelanganaVoters #VoterList #TelanganaVoterList #SpecialIntensiveRevision #ASDVoters #VoterRevision #TelanganaElections #DraftVoterList #VoterClaims #VoterObjections #Hyderabad #Rangareddy #Medchal #TelanganaNews