లాఠీ చేతిలో ఉంటే.. చట్టం మరిచిపోతారా?
ప్రజలను కాపాడాల్సిన చేతులే.. ప్రజలపై లాఠీలు ఝళిపిస్తే? చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులే.. హద్దులు దాటితే? దేశ రాజధాని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలపై జరిగిన పోలీసుల చర్యలు ఇప్పుడు ఇదే ప్రశ్నను దేశం ముందుంచుతున్నాయి. నిరసనకారులపై పోలీసుల దాడులు, అతిగా బలప్రయోగం, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందిస్తోంది. యువ ఐపీఎస్ అధికారులు స్వయంగా ఆందోళనకారులపై దాడులకు దిగడం చూసి తాను తీవ్రంగా కలత చెందానని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చేసిన వ్యాఖ్యలు పోలీసింగ్ వ్యవస్థపై గట్టి హెచ్చరికగా మారాయి. పోలీసు చేతిలో లాఠీ ఉండొచ్చు.. అధికారం ఉండొచ్చు.. కానీ ఆ అధికారం రాజ్యాంగం కంటే పైకాదన్న సందేశాన్ని ఆయన స్పష్టం చేశారు. కస్టడీ మరణాలు, హింస, ఫేక్ ఎన్‌కౌంటర్లపైనా మండిపడిన జస్టిస్ భూయాన్.. ప్రభుత్వ ఉద్యోగులే చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రజల్లో చట్టంపై గౌరవం క్షీణిస్తుందని హెచ్చరించారు. జంతర్‌మంతర్ ఘటనపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయడంతో.. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే—పోలీసు బలమా? రాజ్యాంగ బలమా?
పోలీసులపై సుప్రీం జడ్జి తీవ్ర ఆగ్రహం
జంతర్‌మంతర్ వద్ద ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్యలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీవ్రంగా తప్పుబట్టారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి యశోవర్ధన్ ఆజాద్ రచించిన ‘Policing the Republic’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువ ఐపీఎస్ అధికారులు స్వయంగా నిరసనకారులపై దాడులు చేయడం చాలా బాధాకరంగా ఉందన్నారు. పోలీసు అధికారుల్లో ఉండాల్సిన నిష్పాక్షికత, సంయమనం క్రమంగా కనుమరుగవుతున్నట్లు కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు పోలీసు అంటే ప్రభుత్వ అధికారం, రక్షణకు ప్రతీక అని గుర్తుచేసిన ఆయన.. పోలీసు వ్యవస్థ తన విశ్వసనీయతను కాపాడుకోవడం అత్యంత అవసరమన్నారు.
బలప్రయోగం కాదు.. హక్కుల రక్షణ
సమర్థవంతమైన పోలీసింగ్ కోసం అతిగా బలప్రయోగం చేయాల్సిన అవసరం లేదని జస్టిస్ భూయాన్ స్పష్టం చేశారు. మానవ హక్కులను ఉల్లంఘించకుండా శాంతిభద్రతలను కాపాడవచ్చన్నారు. జులై 20న జంతర్‌మంతర్ వద్ద విద్యార్థుల నిరసనలు, పార్లమెంట్ మార్చ్ సందర్భంగా ఢిల్లీ పోలీసులు అధిక బలప్రయోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు ఇప్పటికే ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్. సుభాష్‌రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ లాఠీచార్జి, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్, ఎలక్ట్రానిక్ బాటన్ల వినియోగం, మహిళా నిరసనకారులపై వేధింపుల ఆరోపణలను పరిశీలించనుంది. సీసీటీవీ, వీడియో ఆధారాలను కూడా పరిశీలించనుంది.
కస్టడీ హింసపై సుప్రీం హెచ్చరిక
పోలీసుల అదుపులో జరిగే హింస, కస్టడీ మరణాలను జస్టిస్ భూయాన్ అత్యంత తీవ్రమైన నేరాలుగా అభివర్ణించారు. దర్యాప్తు, విచారణ సమయంలో ఎలాంటి హింస, అమానవీయ ప్రవర్తన జరిగినా అది రాజ్యాంగ విలువలకు విరుద్ధమన్నారు. ప్రభుత్వ వ్యవస్థలో పనిచేసేవారే చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రజల్లో చట్టంపై గౌరవం తగ్గి, అరాచకానికి మార్గం ఏర్పడుతుందని హెచ్చరించారు. పోలీసు అరెస్టు చేసినంత మాత్రాన పౌరుడు తన ప్రాథమిక హక్కులను కోల్పోడని స్పష్టం చేశారు. ఫేక్ ఎన్‌కౌంటర్లపైనా తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన.. అవి చట్టపాలన స్ఫూర్తినే దెబ్బతీస్తాయని, ఎన్కౌంటర్ పేరుతో న్యాయవ్యవస్థకు బయట శిక్ష విధించే ధోరణి పోలీసింగ్‌లో భాగం కాకూడదని స్పష్టం చేశారు.











