కాళేశ్వరం-మాటల మంటలు

32


కాళేశ్వరం ప్రాజెక్టు అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. మూడు నెలలు అవకాశం ఇస్తే నీటి సమస్యలు పరిష్కరిస్తానన్న బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకత్వం వరుసగా కౌంటర్లు ఇస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ముందు కాంగ్రెస్‌లో చేరితేనే అవకాశం గురించి ఆలోచిస్తామని వ్యంగ్యంగా స్పందించగా, జలవనరుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పదేళ్లు అధికారంలో ఉండి చేయలేనిది ఇప్పుడు ఎలా చేస్తారని ప్రశ్నించారు. కాళేశ్వరం నిర్మాణం కమిషన్ల కోసమే జరిగిందని, హరీశ్‌ను కేసీఆరే నీటిపారుదల శాఖ నుంచి తప్పించారని ఉత్తమ్ ఆరోపించారు. మరోవైపు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ రాజకీయాలకే పరిమితమయ్యాయని మండిపడ్డారు. అవినీతి జరిగి ఉంటే దోషులను కఠినంగా శిక్షించాలని, అదే సమయంలో ప్రజల డబ్బుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును రైతుల ప్రయోజనాల కోసం వెంటనే వినియోగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఒకవైపు హరీశ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుండగా, కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తోంది. మధ్యలో ఈటల ప్రజల ప్రయోజనాలే ముఖ్యమంటూ రెండు పార్టీలకూ హెచ్చరికలు జారీ చేయడంతో కాళేశ్వరం చుట్టూ రాజకీయ సవాళ్లు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి.