ప్రభుత్వాన్ని నిలదీస్తామన్న హరీశ్ రావు.
సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభ పురస్కారాల కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు హాజరయ్యారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన దళిత విద్యార్థులకు అవార్డులు అందజేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్ రామ్ వంటి మహనీయుల కృషితో లభించిన రిజర్వేషన్ల అవకాశాలతో ఎదిగిన వారు సమాజానికి తిరిగి సేవ చేయాలని హరీశ్ రావు సూచించారు. పదేళ్ల క్రితం మాదిగ ఉద్యోగులు ఏర్పాటు చేసిన సొసైటీ ప్రతినెలా ఉద్యోగుల వేతనం నుంచి రూ.వెయ్యి చొప్పున సేకరించి రూ.10 లక్షల నిధిని ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం అభినందనీయమన్నారు. ఐదేళ్ల క్రితం ఫీజు కోసం తనను ఆశ్రయించిన రోహిత్ ప్రస్తుతం ఏడాదికి రూ.6 లక్షలు సంపాదిస్తూ తొలి ఏడాది ఆదాయాన్ని పేద విద్యార్థుల కోసం తిరిగి ఇవ్వడం స్ఫూర్తిదాయకమన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థిని శ్రీజకు రెండో సంవత్సరం ఫీజు తానే చెల్లిస్తున్నానని, పేద దళిత విద్యార్థులు డాక్టర్లుగా ఎదగడానికి తన వంతు సహాయం కొనసాగుతుందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు
కేసీఆర్ పాలనలో దళిత గురుకులాలు, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్, దళితబంధు వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చామని హరీశ్ రావు చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కు రూ.5,403 కోట్లు కేటాయించి కేవలం రూ.74 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు సకాలంలో అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లలో రూ.19 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించామని గుర్తుచేశారు. విద్యార్థుల హక్కులు, సంక్షేమ నిధుల కోసం అసెంబ్లీలో కొట్లాడతామని హామీ ఇచ్చారు. పేదరికం, కులం చదువుకు అడ్డంకులు కావని, పట్టుదలతో చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.
#HarishRao #TelanganaPolitics #BRS #TelanganaAssembly #StudentRights #StudentWelfare #DalitStudents #Scholarships #FeeReimbursement #SCCorporation #KCR #TelanganaEducation #DalitWelfare #Siddipet #TelanganaNews











