శాసనసభ వద్ద జరిగిన ఉద్రిక్త పరిణామాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఉద్దేశించి చేసినవి కాదని స్పష్టం చేశారు. అసెంబ్లీలోకి వెళ్లే సమయంలో తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యంగా మహిళా ప్రజాప్రతినిధులతో పోలీసులకు తోపులాట జరిగిందని తెలిపారు. ఆ సమయంలో తనపై కూడా దాడి జరిగిందని, షర్టు, ప్యాంటు లాగేందుకు, గొంతు నొక్కేందుకు ప్రయత్నించినట్లు అనిపించిందని చెప్పారు. కొంతమంది తనను దుర్భాషలాడారని పేర్కొన్నారు. ఈ పరిణామాలతో తీవ్ర ఆవేదనకు గురై తనపై దాడి చేసింది ఎవరు? తన దుస్తులు లాగేందుకు ఎవరు ప్రయత్నించారు? అలా చేయమని ఎవరు ఆదేశించారు? అని ప్రశ్నించినట్లు వివరించారు. ఆ వ్యాఖ్యలను స్పీకర్‌ను ఉద్దేశించి చేసినవిగా భావించడం సరికాదన్నారు. స్పీకర్ వ్యవస్థపై, వ్యక్తిగతంగా స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై తనకు ఎంతో గౌరవం ఉందని తాతా మధు తెలిపారు.
అవసరమైతే వ్యాఖ్యలు వెనక్కి
తన మాటల్లో ఏదైనా స్పీకర్‌ను ఉద్దేశించినట్లు భావిస్తే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని తాతా మధు ప్రకటించారు. అసలు సమస్యను పక్కనపెట్టి తన వ్యాఖ్యల చుట్టూ వివాదం నడపడం కంటే, అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనపై దృష్టి పెట్టాలని కోరారు. మహిళా ఎమ్మెల్యేలతో పోలీసులు వ్యవహరించిన తీరుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ సీనియర్ నాయకులను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారని తెలిపారు. ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులతో వ్యవహరించే విషయంలో ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై జరిగిన ఘటనకు ప్రభుత్వం స్పందించాలని కోరారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి రేవంత్‌రెడ్డి ఈ వ్యవహారంపై దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికార, ప్రతిపక్షాల మధ్య ఈ ఘటనపై భిన్న వాదనలు కొనసాగుతున్న వేళ తాతా మధు తాజా వివరణ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
#TattaMadhusudhan #TattaMadhu #GaddamPrasadKumar #TelanganaAssembly #BRS #BRSMLC #SpeakerRemarks #TattaMadhuClarification #TattaMadhuApology #AssemblyGateIncident #BRSProtest #TelanganaPolice #PoliceControversy #WomenMLAs #BRSLeaders #RevanthReddy #TelanganaPolitics #AssemblyControversy #TelanganaNews #OppositionProtest











