Home Telangana అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ హల్‌చల్

అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ హల్‌చల్

నల్ల టీషర్టులతో నిరసన.. అరెస్టులు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందే అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల పాలనలో ఇచ్చిన హామీల అమలును ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీషర్టులు ధరించి అసెంబ్లీకి చేరుకున్నారు. నినాదాలు, ప్లకార్డులతో వచ్చిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం, తోపులాట జరిగింది. నల్ల టీషర్టులతో సభలోకి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో హరీశ్‌రావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిరసనగా తన టీషర్ట్ విప్పి బనియన్‌తో అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అనిల్ జాదవ్, వివేక్, వేముల ప్రశాంత్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు కూడా టీషర్టులు విప్పి నిరసన తెలిపారు. హరీశ్‌రావును అసెంబ్లీ మెయిన్ గేటు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణ భవన్‌కు తరలించారు. రాహుల్‌గాంధీ టీషర్టుతో పార్లమెంట్‌కు వెళ్లినప్పుడు అభ్యంతరం లేనప్పుడు, తాము నల్ల టీషర్టులతో నిరసన తెలపడం ఎందుకు తప్పని హరీశ్‌రావు ప్రశ్నించారు. 22ఏ నిషేధిత భూముల అంశాన్ని సభలో ప్రస్తావించేందుకు సిద్ధమైన సమయంలోనే తమను అడ్డుకున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

మహిళా ఎమ్మెల్యేలపై దాడుల ఆరోపణలు

పోలీసులతో జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతికి, నుదిటికి గాయాలైనట్లు పార్టీ నేతలు తెలిపారు. పోలీసులు అతి చేయవద్దని కేటీఆర్ హెచ్చరించారు. మరోవైపు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అసెంబ్లీ గేటు వద్ద కిందపడిపోయారని, కొద్దిసేపు స్పృహ కోల్పోయినట్లు బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తన చీరను పోలీసులు లాగారని, బూట్లతో తొక్కారని ఆరోపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారని హరీశ్‌రావు ఆరోపించారు. మహిళా ప్రజాప్రతినిధులతో ఇలాంటి ప్రవర్తన దారుణమని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు.

రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపు

ఈ ఘటనపై బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టింది. హామీల అమలు, 22ఏ నిషేధిత భూముల వ్యవహారం సహా ప్రజా సమస్యలను ప్రశ్నించకుండా ప్రతిపక్షాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. బీఆర్ఎస్ సభ్యులు సభలో లేని సమయంలో 22ఏ అంశంపై చర్చించడం సరికాదని అన్నారు. తమపై అవినీతి ఆరోపణలు తప్పని భావిస్తే, బీఆర్ఎస్ సభ్యులు సభకు వచ్చిన తర్వాతే ఈ అంశంపై చర్చించాలని ప్రభుత్వానికి సవాల్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సభలో బయటపడతాయనే భయంతోనే తమను అడ్డుకున్నారని ఆరోపించారు. మహిళా ప్రజాప్రతినిధులపై పోలీసుల తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. అసెంబ్లీ గేటు వద్ద జరిగిన అరెస్టులు, తోపులాట, గాయాల ఘటనలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలు పిలుపునిచ్చారు.

 

#BRS #BRSProtest #BlackTShirtProtest #TelanganaAssembly #AssemblyProtest #HarishRao #HarishRaoArrest #KTR #KTRProtest #BRSMLAs #BRSMLCs #TelanganaAssemblyGate #PoliceClash #TelanganaPolice #22ALands #22AProhibitedLands #SunithaLakshmaReddy #SabitaIndraReddy #JagadishReddy #RevanthReddy #CongressGovernment #StatewideProtest #TelanganaPolitics #TelanganaNews