సీతక్క ఆరోపణలతో అసెంబ్లీ గేటు వివాదం.
తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద ఇటీవల జరిగిన నిరసన ఘటనపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. బీఆర్ఎస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంచలన ఆరోపణలు చేశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవ లక్ష్మిలను గంగుల కమలాకర్, సుధీర్‌రెడ్డి వెనుక నుంచి నెట్టేశారని ఆమె పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలను మీడియా ముందు విడుదల చేశారు. మహిళా ఎమ్మెల్యేలను పక్కకు నెట్టేసి గంగుల కమలాకర్ ముందుకు వెళ్లడం సిగ్గుచేటని సీతక్క వ్యాఖ్యానించారు. సొంత పార్టీ మహిళా సభ్యుల పట్ల పురుష ఎమ్మెల్యేలు ఇలా వ్యవహరించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. గత సోమవారం నల్ల చొక్కాలు ధరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకున్న సమయంలో ఈ ఘటనలు జరిగినట్లు ఆమె వివరించారు.
పోలీసులపై బీఆర్ఎస్ ఆరోపణలు
మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు చేయి చేసుకున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న సమయంలో సీతక్క చేసిన తాజా వ్యాఖ్యలు వివాదాన్ని మరో మలుపు తిప్పాయి. విధులకు ఆటంకం కలిగించడం, మహిళా పోలీసుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం వంటి ఆరోపణలపై కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు తమ ఎదుట చొక్కాలు విప్పి అర్ధనగ్నంగా నిలబడ్డారని, తమను నెట్టివేసి ఇబ్బందులకు గురిచేశారని ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతల ప్రవర్తనలో గాయపడిన మహిళా పోలీసు సిబ్బందిని సీతక్క పరామర్శించారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే చర్యలను ప్రభుత్వం సహించబోదని ఆమె స్పష్టం చేశారు. అయితే సీతక్క విడుదల చేసిన వీడియోలు, ఫొటోలు నిజమైనవి కావని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. అవి మార్ఫింగ్ చేసినవి, ఏఐ ద్వారా రూపొందించినవని ఆరోపించారు. దీంతో అసెంబ్లీ గేటు వద్ద జరిగిన ఘటనపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ వివాదం మరింత ముదిరింది.
#Seethakka #TelanganaAssembly #AssemblyGateRow #AssemblyGateIncident #BRS #BRSProtest #WomenMLAs #SabitaIndraReddy #SunithaLakshmaReddy #KovaLakshmi #GangulaKamalakar #SudheerReddy #BRSWomenMLAs #SeethakkaAllegations #TelanganaPolitics #BRSvsCongress #PoliceClash #WomenPolice #KTR #HarishRao #PoliticalControversy #TelanganaNews











