Home Telangana కబ్జాదారులకు రేవంత్ వార్నింగ్… హైడ్రా ఆగదు!

కబ్జాదారులకు రేవంత్ వార్నింగ్… హైడ్రా ఆగదు!

Revanth Reddy on HYDRA

“హైడ్రా ఆగదు… కబ్జాదారులను వదలం!”

“కోర్టులను గౌరవిస్తాం… కానీ కబ్జాదారులను మాత్రం విడిచిపెట్టం. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న వాళ్ల ఆటలు ఇక సాగవు. హైడ్రా మా ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణ. దేశమంతా ప్రశంసిస్తున్న సంస్థ ఇది. దీన్ని ఇంకా బలోపేతం చేస్తాం. హైడ్రా ఎవరి సొంత ఇళ్లను కూల్చదు… ప్రభుత్వ భూమిని, పార్కును, చెరువును, నాలాను కబ్జా చేస్తే మాత్రం తప్పకుండా కూలుస్తుంది. ధనవంతుడైనా… పేదవాడైనా చట్టం ముందు ఒక్కటే. బతుకమ్మ కుంటలు, గండిపేట చెరువులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇప్పుడు కోర్టుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారు. సోషల్ మీడియాలో అబద్ధాల ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనుకుంటున్నారు. మాకు న్యాయవ్యవస్థపై సంపూర్ణ విశ్వాసం ఉంది. హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం. న్యాయస్థానంలో మా వాదన చెబుతాం. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం… తెలంగాణలో కబ్జాదారుల ఆటలు ఇక సాగవు. హైడ్రా ఆగదు… తగ్గదు… ఇంకా మరింత శక్తివంతంగా ముందుకు వెళ్తుంది. ప్రజల ఆస్తిని కాపాడటమే మా బాధ్యత… అదే చేస్తాం.” అంటూ సీఎం రేవంత్ రెడ్డి కుండబద్ధలు కొట్టారు. 

హైడ్రాపై వెనక్కి తగ్గం..  స్పష్టం చేసిన సీఎం

హైడ్రా పనితీరుపై ఎలాంటి సందేహాలకు తావులేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పూర్తిగా గౌరవిస్తుందని చెప్పిన ఆయన, అదే సమయంలో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూములను రక్షించే హైడ్రా కార్యాచరణ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగబోదని ప్రకటించారు. ప్రభుత్వ సంస్కరణల్లో హైడ్రా అత్యంత గొప్ప సంస్కరణగా అభివర్ణించిన సీఎం, దానిని మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు. కబ్జాదారులు కోర్టులను తప్పుదోవ పట్టిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఆయన, అలాంటి కేసులను న్యాయస్థానాల్లోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఆరోపణ

హైడ్రాకు సంబంధించిన హైకోర్టు తాజా ఆదేశాలను ఇంకా పూర్తిగా పరిశీలించలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం న్యాయపరంగా సమీక్ష నిర్వహించిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. కోర్టు ఇచ్చే ప్రతి ఆదేశాన్ని ప్రభుత్వం గౌరవిస్తుందని స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థపై తమకు సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొంటూ, న్యాయస్థానాల ముందు ప్రభుత్వ వాదనను సమర్థంగా వినిపిస్తామని తెలిపారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, నాలాలను ఆక్రమించిన కొందరు తప్పుడు పత్రాలతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని సీఎం ఆరోపించారు. అలాంటి వ్యక్తులే ఇప్పుడు కోర్టు ధిక్కరణ కేసులను ఆయుధంగా ఉపయోగిస్తున్నారని విమర్శించారు. కోర్టు ధిక్కరణ కేసు నమోదైతే అధికారులను తప్పనిసరిగా మార్చాలనే నిబంధన ఉంటే గతంలో మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌పై వందలాది కోర్టు ధిక్కరణ కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. అప్పట్లో ఈ అంశంపై ప్రశ్నించని వారు ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం విమర్శలు చేస్తున్నారని అన్నారు.

హైడ్రా ఎందుకు అవసరం?

హైడ్రా లక్ష్యం ప్రజల ఇళ్లను కూల్చడం కాదని, ప్రభుత్వ ఆస్తులను రక్షించడమేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పార్కులు, చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే ఎవరికైనా చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలు ధనవంతులవైనా, పేదవారివైనా ఒకే విధంగా చట్టం అమలవుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా హైడ్రా పనితీరుకు ప్రశంసలు లభిస్తున్నాయని, ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యుత్తమ సంస్థల్లో ఒకటిగా నిలిచిందని చెప్పారు.

బతుకమ్మ కుంట ఉదాహరణ

బతుకమ్మ కుంట ఆక్రమణ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుంటను ఆక్రమించి విక్రయించిన వారే ఇప్పుడు కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్‌కు చెందిన నాయకులు ప్రభుత్వ భూములను ఆక్రమించి లాభాలు పొందారని విమర్శించారు. గండిపేట చెరువు, బతుకమ్మ కుంట వంటి ప్రభుత్వ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకోవడం తప్పు కాదని అన్నారు. అలాంటి కబ్జాదారులను రక్షించేందుకు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని అపకీర్తిపాలు చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. హైడ్రా భవిష్యత్తుపై కూడా సీఎం స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణలో హైడ్రా పాత్ర మరింత పెరుగుతుందని తెలిపారు. సంస్థకు మరిన్ని అధికారాలు కల్పిస్తామని వెల్లడించారు. చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని, హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ హైడ్రా కార్యక్రమాలను మరింత సమర్థంగా కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీంతో అక్రమ ఆక్రమణలపై ప్రభుత్వం తన వైఖరిలో ఎలాంటి మార్పు లేదనే సందేశాన్ని సీఎం మరోసారి స్పష్టంగా వెల్లడించారు.