Home Telangana ఈసారి నేనేం చేయలేను లక్ష్మణ రేఖ దాటితే అంతే!

ఈసారి నేనేం చేయలేను లక్ష్మణ రేఖ దాటితే అంతే!

కొండా సురేఖపై చర్యలు.
పీసీసీ మహేష్ గౌడ్ సూచనలు.

కొండా సురేఖ, ఆమె కుమార్తె కొండా సుస్మిత వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రకంపనలు రేపుతున్న వేళ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నియమాలను ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిజామాబాద్‌లో జరిగిన చిట్‌చాట్‌లో మాట్లాడిన ఆయన.. గతంలో కొండా సురేఖను తాను కాపాడానని, అయితే ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. “అవకాశం ఉంటే ఇప్పుడు కాపాడే పరిస్థితి లేదు” అన్న ఆయన వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారితీశాయి. కొండా సుస్మిత పార్టీ లైన్ దాటి నేరుగా ఆరోపణలు చేశారని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. ఇదే అంశంలో అనిరుధ్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి నేరుగా విమర్శలు చేయలేదని చెప్పారు. పార్టీ నేతలకు ఏవైనా సమస్యలు ఉంటే వాటిని బహిరంగంగా కాకుండా అంతర్గతంగా చర్చించుకోవాలని సూచించారు. ఇందుకోసం పార్టీలో వివిధ కమిటీలు ఉన్నాయని, అవసరమైతే ఢిల్లీ వెళ్లి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దృష్టికి సమస్యలను తీసుకెళ్లవచ్చని తెలిపారు. ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ పరిశీలన పూర్తయ్యాకే కొండా సురేఖపై తదుపరి చర్యలపై నిర్ణయం ఉంటుందని మహేష్ గౌడ్ వెల్లడించారు. కాంగ్రెస్ నియంతృత్వ పార్టీ కాదని, నేతలకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని చెబుతూనే, ఇష్టానుసారం బహిరంగ వ్యాఖ్యలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో కొండా సురేఖ వ్యవహారంలో పార్టీ అధిష్ఠానం తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ పెరిగింది.

 

#KondaSurekha #MaheshKumarGoud #TelanganaCongress #TPCC #KondaSusmitha #Congress #CongressDiscipline #DisciplinaryAction #KCSVenugopal #AICC #TelanganaPolitics #CongressControversy #TelanganaNews #PoliticalDispute #CongressLeadership