దసరాలోపు పూర్తి ఉత్పత్తికి ఆదేశాలు.
బొగ్గు సమస్యపై ఉన్నతాధికారులతో సమీక్ష.
హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సమీక్ష నిర్వహించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి ఎందుకు జరగడం లేదని అధికారులను ప్రశ్నించారు. ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి జీ-9 రకం బొగ్గు అవసరమని అధికారులు వివరించారు. అయితే సింగరేణిలో జీ-9 బొగ్గు ఉత్పత్తి చేసే బ్లాకులు ప్రస్తుతం లేవని, సమీప భవిష్యత్తులోనూ ఆ రకం బొగ్గు లభించే అవకాశం లేదని తెలిపారు. దీనిపై సీఎం, డిప్యూటీ సీఎం తీవ్రంగా ప్రశ్నించారు. జీ-9 బొగ్గు అందుబాటులో లేని పరిస్థితిలో అదే సాంకేతికతతో యాదాద్రి ప్లాంట్‌ను ఎలా నిర్మించారని నిలదీశారు.
రూ.40 వేల కోట్ల అదనపు భారం
యాదాద్రి థర్మల్ కేంద్రాన్ని బొగ్గు గనుల వద్దే నిర్మించకుండా దూరంగా ఏర్పాటు చేయడంపైనా సీఎం, డిప్యూటీ సీఎం అధికారులను వివరణ కోరారు. పిట్‌హెడ్ ప్లాంట్‌గా నిర్మించి ఉంటే రవాణా భారం తగ్గేదని పేర్కొన్నారు. రాజకీయ కారణాలతోనే గత ప్రభుత్వం ఈ ప్లాంట్‌ను గనులకు దూరంగా నిర్మించిందని అధికారులు వెల్లడించారు. యాదాద్రికి బొగ్గు తరలింపు వల్ల రాష్ట్రంపై దాదాపు రూ.40 వేల కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపారు. సింగరేణి నుంచి జీ-9 బొగ్గు అందించే అవకాశాలపై కూడా సీఎం ఆరా తీశారు. గత ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనకపోవడం వల్ల సింగరేణి నుంచి ఆ రకం బొగ్గు సరఫరా కాలేదని అధికారులు వివరించారు. ఇప్పటికే సింగరేణిలో 14 బొగ్గు బ్లాకులు మూతపడ్డాయని తెలిపారు.
ఇతర వనరుల నుంచి బొగ్గు కొనుగోలు
రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మహానది కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా నుంచి బొగ్గు కొనుగోలు చర్యలు వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో తక్షణమే చర్చలు జరపాలని భట్టి విక్రమార్కకు సీఎం సూచించారు. బొగ్గు సరఫరాపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించి యాదాద్రి ప్లాంట్ ఉత్పత్తిని పెంచాలని ఆదేశించారు. దసరాలోపు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తి సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.
#YadadriThermalPowerPlant #RevanthReddy #BhattiVikramarka #TelanganaPower #G9Coal #Singareni #CoalShortage #PowerGeneration #TelanganaGovernment #CoalIndia #MahanadiCoalfields #TGGENCO #ThermalPower #ElectricityCrisis #TelanganaNews











