Home Telangana నవంబర్‌లో కాళేశ్వరం వర్క్స్

నవంబర్‌లో కాళేశ్వరం వర్క్స్

బ్యారేజీలకు పునరుద్ధరణకు శ్రీకారం.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనులను నవంబర్‌ రెండో వారంలో ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 2027 వర్షాకాలం ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. మూడు బ్యారేజీల భద్రతను పెంచడంతోపాటు పూర్తి సామర్థ్యాన్ని పునరుద్ధరించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో పునరుద్ధరణ ప్రతిపాదనలపై చర్చించారు. గ్రౌటింగ్‌తో పునాదుల బలోపేతం, స్టిల్లింగ్‌ బేసిన్ల పొడిగింపు, కొత్త కట్‌ఆఫ్‌ వాల్స్‌ నిర్మాణం వంటి కీలక పనులు చేపట్టనున్నట్లు మంత్రి వివరించారు.

డిజైన్లకు నిపుణుల పరీక్ష

వరద ప్రవాహ వేగాన్ని నియంత్రించడంలో ఉన్న లోపాలను సరిచేయడం, పునాదుల స్థిరత్వాన్ని పెంచడం, నీటి చొరబాటును అడ్డుకోవడం పునరుద్ధరణ పనుల ప్రధాన లక్ష్యాలని మంత్రి చెప్పారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్‌ఏ)తోపాటు ఇతర నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకుని డిజైన్లు రూపొందించినట్లు తెలిపారు. పుణేలోని సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌లో కంప్యూటేషనల్‌ ఫ్లూయిడ్‌ డైనమిక్స్‌ నమూనాలతో డిజైన్లను పరీక్షిస్తున్నట్లు చెప్పారు. వివిధ వరద ప్రవాహ పరిస్థితుల్లో ప్రతిపాదిత చర్యలు ఎంత సమర్థంగా పనిచేస్తాయో ఈ పరీక్షల ద్వారా అంచనా వేయనున్నారు. ఖరారు చేసిన డిజైన్లను అక్టోబర్‌ 5న న్యూఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలోని సాంకేతిక పర్యవేక్షణ కమిటీ ముందు ఉంచనున్నారు.

భద్రతలో రాజీ ఉండదన్న మంత్రి

సాంకేతిక అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. డిజైన్లకు ఆమోదం లభించిన వెంటనే టెండర్లు పిలిచి పనులు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. పనుల్లో కఠినమైన నాణ్యతా ప్రమాణాలు, స్వతంత్ర పరీక్షలు, స్పష్టమైన కాలపరిమితులు ఉండాలని ఆదేశించారు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టకుండా దీర్ఘకాలం మన్నే సాంకేతిక పరిష్కారాలతో బ్యారేజీలను పునరుద్ధరించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జాతీయ సాంకేతిక సంస్థల నుంచి అవసరమైన భద్రతా అనుమతులు వచ్చిన తర్వాతే మూడు బ్యారేజీలను తిరిగి నిర్వహణలోకి తీసుకొస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి దశను నిపుణుల పర్యవేక్షణలో నమోదు చేయాలని, ఎన్‌డీఎస్‌ఏ సూచనలను పూర్తిగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు.

 

#Kaleshwaram #KaleshwaramProject #MedigaddaBarrage #AnnaramBarrage #SundillaBarrage #UttamKumarReddy #TelanganaIrrigation #BarrageRestoration #NDSA #CWPRS #CentralWaterCommission #IrrigationProjects #KaleshwaramWorks #TelanganaNews #BarrageSafety