గణేశుడి కోసం మగ్గంపై వస్త్రాల తయారీ, చేనేత సంప్రదాయానికి స్వేన్‌లేక్‌ కాలనీ పట్టం

Loom Worship for Lord Ganesha


మగ్గానికి పూజ.. గణేశుడికి కానుక

హైదరాబాద్‌లోని స్వేన్‌లేక్‌ అపార్ట్‌మెంట్‌లో ఆగస్టు 29, 2026న గణేశుడి కోసం ధోతి, కండువా తయారు చేసే కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం పోచంపల్లి చేనేత కార్మికులను ప్రత్యేకంగా ఆహ్వానించి మగ్గంపై స్వామివారి కోసం ధోతి, కండువా నేయిస్తున్నారు. తెలంగాణ చేనేత సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే పోచంపల్లి నేత కళను గణేశుడి ఆరాధనతో ముడిపెట్టడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ దేవాంగ సంఘం అధ్యక్షులు, స్వేన్‌లేక్‌ కాలనీ సంఘం అధ్యక్షుడు చోళ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మగ్గానికి పూజలు చేసి, చేనేత వృత్తికి గౌరవం చాటారు. ఈ సందర్భంగా రాజేశ్వరరావు మాట్లాడుతూ చేనేత మన సంస్కృతిలో అంతర్భాగమని, పూర్వీకుల నుంచి వస్తున్న మగ్గం సంప్రదాయాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. స్వామివారికి స్వయంగా నేసిన వస్త్రాలను సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించడం, వారి కళకు గుర్తింపు తీసుకురావడం లక్ష్యంగా ప్రతి ఏడాది ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కాలనీ వాసులు భక్తిశ్రద్ధలతో పాల్గొని గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.