సహజీవనమే హిందుత్వం… ముస్లింలు వద్దనుకుంటే హిందువే కాదు
న్యూయార్క్ వేదికగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
న్యూయార్క్ వేదికగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చకు దారితీశాయి. హిందూ రాష్ట్రం, హిందుత్వం, ముస్లింల స్థానం గురించి పదేపదే ఎదురయ్యే ప్రశ్నకు ఆయన ఈసారి స్పష్టమైన సమాధానం ఇచ్చారు. “భారత్‌లో ముస్లింలు ఉండకూడదని భావించే వ్యక్తి హిందువుగా కొనసాగలేడు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్య హిందుత్వంపై తన దృక్పథాన్ని మరోసారి వెల్లడించింది. న్యూయార్క్‌లో జరిగిన ‘వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ’ కార్యక్రమంలో మాట్లాడిన భాగవత్.. ప్రతి మనిషికి గౌరవం ఉంటుందని, అన్ని మార్గాలు ఒకే లక్ష్యానికి దారితీస్తాయని నమ్మడమే హిందుత్వ సారమని చెప్పారు. గతంలో ఓ కార్యక్రమంలో ముస్లిం సోదరులు తనను “హిందూ రాష్ట్రం అంటున్నారు.. మరి ముస్లింల సంగతేంటి? మమ్మల్ని బయటకు పంపిస్తారా?” అని ప్రశ్నించిన సందర్భాన్ని ఆయన గుర్తుచేశారు. దానికి తాను “అది హిందుత్వం కాదు” అని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. అంతేకాదు, హర్యానా విమాన ప్రమాదం సమయంలో మతం చూడకుండా ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు చేసిన సేవలను ఉదాహరణగా ప్రస్తావించారు. సేవలో మతం కనిపించకూడదని, మానవత్వమే ముందుండాలని ఆయన చెప్పిన సందేశం ఇప్పుడు ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.

‘ముస్లింల సంగతేంటి?’ ప్రశ్నకు సమాధానం
న్యూయార్క్‌లో శనివారం జరిగిన ‘వన్ వరల్డ్ వన్ హ్యుమానిటీ’ బహుమత సంభాషణ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో ముస్లింలు ఉండకూడదని భావించే వ్యక్తి హిందువుగా కొనసాగలేడని స్పష్టం చేశారు. “హిందువుగా పిలుచుకోవాలంటే అన్ని మార్గాలు ఒకే లక్ష్యానికి దారితీస్తాయని నమ్మాలి. ప్రతి మనిషికి గౌరవం ఉంది. మనుషుల మధ్య ఎలాంటి తేడా లేదు” అని అన్నారు. హిందుత్వం అంటే ఇతర మతాలను దూరం చేయడం కాదని వివరించారు. గతంలో తన ప్రసంగానికి హాజరైన ముస్లిం సోదరులు అడిగిన ప్రశ్నను భాగవత్ గుర్తుచేశారు. “మీరు హిందూ సంస్థ. హిందూ రాష్ట్రం అంటున్నారు. మరి ముస్లింల సంగతేంటి? మమ్మల్ని బయటకు పంపిస్తారా?” అని వారు ప్రశ్నించారని చెప్పారు. దానికి తాను “లేదు.. అది హిందుత్వం కాదు” అని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. మరో సందర్భంలో హర్యానాలో విమాన ప్రమాదం జరిగినప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులు సహాయక చర్యల్లో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావించారు. ప్రమాదంలో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నా.. స్వయంసేవకులు మతం చూడకుండా క్షతగాత్రులకు సేవలు అందించి, మృతదేహాలను వెలికితీసి, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారని వివరించారు.

రాజకీయాలకు దూరంగా సేవ
సేవా కార్యక్రమాలు చేయడానికి ఆర్‌ఎస్‌ఎస్ రాజకీయ సంస్థ కాకపోవడం ఒక కారణమని భాగవత్ చెప్పారు. సేవ చేసిన విషయాలను ప్రచారం చేసుకోవాలనే ఉద్దేశం తమకు ఉండదని, ప్రతిఫలం ఆశించకుండా సేవ చేయడమే తమ విధానమని అన్నారు. 1996లో హర్యానాలో జరిగిన సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్, కజకిస్థాన్ ఎయిర్‌లైన్స్ విమానాల ఢీకొన్న ప్రమాదాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ ఘటనలో 349 మంది మరణించారు. ఇదిలా ఉండగా, అమెరికా పర్యటనలో ఉన్న భాగవత్‌పై న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ విమర్శలు చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను మతపరమైన సంస్థగా మమ్దానీ అభివర్ణించిన నేపథ్యంలో భాగవత్ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.











