విజయసాయిరెడ్డి ప్రస్తావించిన అంశాలు
- జగన్‌పై రెండేళ్లుగా తాను బహిరంగంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదన్న విజయసాయి రెడ్డి
- కోటరీ కారణంగా తనకు జరిగిన అవమానాల వల్లే పార్టీ నుంచి బయటకు వచ్చానని వెల్లడి
- పార్టీ పెడతానని ప్రకటించిన తర్వాత తనను విమర్శిస్తున్నారని, తాను మాత్రం ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పోరాటం చేస్తానని ప్రకటన
- అప్పటి ప్రభుత్వాన్ని, ఇప్పుడు పార్టీని కబ్జా చేసి జగన్‌ను మోసం చేసే కోవర్ట్ రాజకీయాలు చేయడం తనకు చేతకాదని వ్యాఖ్యలు
- జగన్ ఏర్పాటు చేసిన వ్యవస్థలో అనేక సందర్భాల్లో తన ఆత్మాభిమానం దెబ్బతిన్నా భరించానని ఆక్రోశం
- 2022 మంగళగిరి పార్టీ ప్లీనరీలో తనపై సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్టుగా, భౌతికంగా దాడి చేశారని ఆరోపణలు
- ఈ ఘటన జగన్‌కు తెలిసినా ప్రేక్షకపాత్ర వహించారని విజయసాయి రెడ్డి ఆవేదన
- 2022లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమన్వయకర్తల సమావేశంలో తనను అవమానకరంగా మాట్లాడారని విమర్శలు
- అనుబంధ సంఘాల ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తనను తప్పించారని వెల్లడి
- గుంటూరు నుంచి తిరుపతి వరకు తనకు అప్పగించిన ఇన్‌చార్జి బాధ్యతలను తొలగించారన్న సాయిరెడ్డి
- కోర్ కమిటీ నుంచి కూడా తనను తొలగించారని ఆవేదన
- తనపై జరిగిన అవమానాలు మొత్తం 74 ఉన్నాయని విజయసాయి రెడ్డి వెల్లడి
- 2020 వరకు జగన్ దృష్టిలో తన మాటకు ఎంతో విలువ ఉండేదని, అదే కోటరీకి కంటగింపుగా మారిందని వాపోయిన సాయిరెడ్డి
- తాను ఎప్పుడూ కోటరీలో లేనని, ఢిల్లీలో జగన్ ఆదేశాల మేరకు పనిచేసేవాడినని చెప్పారు.
- తాను ఢిల్లీలో పనిచేస్తున్న సమయంలో సజ్జల జగన్ వద్ద ఉంటూ తనను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేశారని ఆరోపణలు
- వైసీపీలో ప్రస్తుతం జగన్ నంబర్ 2గా, సజ్జల నంబర్ 1గా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు
- రెండున్నరేళ్ల టీడీపీ పాలనలో “సకల శాఖల మంత్రి” పేరుపై ఇప్పటివరకు ఎలాంటి చార్జిషీట్ లేదు
- సజ్జల ఆదేశాలకు తలవంచి సర్దుకుపోవడం తనకు సాధ్యం కాదని స్పష్టీకరణ
- నమస్కారాలు, సాష్టాంగాలు, దండాలు పెట్టి పార్టీలో కొనసాగలేనని వ్యాఖ్యలు
- 2024 ఎన్నికల తర్వాత పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయన్న సాయిరెడ్డి
- ఆ పరిస్థితుల కారణంగానే వైసీపీకి, తన రాజ్యసభ పదవికి రాజీనామా చేశానని వెల్లడి
- ఇప్పుడు కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నానని విజయసాయి రెడ్డి ప్రకటన
- జగన్‌కి తాను నమ్మక ద్రోహం చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోనని స్పష్టీకరణ
- వైసీపీలో ఎవరు కోవర్టులుగా పనిచేస్తున్నారు, ఎవరు నమ్మక ద్రోహం చేస్తున్నారో కార్యకర్తలు, జగన్ అభిమానులు ఆలోచించుకోవాలని సూచన
- మరో సందర్భంలో మీడియా ద్వారా మరిన్ని విషయాలు వెల్లడిస్తానని విజయసాయి రెడ్డి
విజయసాయి రెడ్డి బహిరంగ లేఖ- ఆగస్టు 29, 2026 (లేఖ పూర్తి సారాంశం)
వైఎస్సార్‌సీపీ “కోటరీ” నా మీద “నమ్మక ద్రోహి” అంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచార పోస్టులు పెట్టిస్తున్నందున ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. నమ్మకద్రోహినే అయితే ఆనాడే సజ్జల మాదిరిగా కాంగ్రెస్‌తో సంధి చేసుకుని, సీబీఐ, ఈడీ చార్జిషీట్‌లో నా పేరు లేకుండా చేసుకునేవాడిని. జగన్‌గారికి నమ్మకస్తుడిని అనే ఒకే ఒక్క కారణంగా జగన్‌గారితో పాటు ప్రతి చార్జిషీట్‌లోనూ నన్ను ఎ-2గా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చింది. జగన్‌గారు 16 నెలలు జైల్లో ఉంటే నన్ను 15 నెలలు జైల్లో పెట్టారు. నమ్మక ద్రోహం నా రక్తంలో ఉంటే, అప్పుడే అప్రూవర్‌గా మారేవాడిని.
2024 ఎన్నికల తర్వాత కూడా నాకు సంబంధం లేని లిక్కర్ స్కామ్‌లో నన్ను ఎ-5గా చేర్చారు. కాకినాడ సీపోర్టు కేసులో ఏ-2గా చేర్చారు. ఈ రెండున్నర ఏళ్ల టీడీపీ పాలనలో “సకల శాఖల మంత్రి” పేరు మాత్రం ఇంతవరకు ఏ చార్జిషీట్‌లోనూ లేదు. జగన్‌గారికి వెన్నుపోటు పొడుస్తూ, ఆయనకు తెలియకుండా టీడీపీతో కలిసి ఎలా పని చేయాలో, ఏ కేసులూ లేకుండా ఎలా చేసుకోవాలో అక్కడ ఉన్న “కోటరీ నాయకుడు”కి తెలిసినంత నాకు తెలియదు. నేను ఏనాడూ అలాంటి నమ్మక ద్రోహం పనులు చేయలేదు.
ఇప్పుడు పార్టీ మారటానికి రెడీగా ఉన్న “ఉత్తరాంధ్ర నాయకుడు”తో కలిసి ఈ కోటరీ నాయకుడే 2020 నుంచి జగన్‌గారు ముఖ్యమంత్రిగా ఉండగా, నా మీద విపరీతంగా చాడీలు చెప్పించి నన్ను ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి తప్పించటానికి కారణం అయ్యాడు. జగన్‌గారి మెప్పు పొందడానికి నాస్తికుడిగా, కమ్యూనిస్ట్‌గా చెప్పుకునే ఇతను వైఎస్సార్‌సీపీకే కాదు, రాష్ట్రానికే నమ్మకద్రోహి.
కుటుంబం కోసం 40 ఏళ్లు అత్యంత నమ్మకస్తుడిగా పని చేసిన నేను, నా ఆత్మగౌరవానికి 2020 నుంచి భంగం కలిగించింది ఎవరు? నన్ను గుంటూరులో కాని, ఢిల్లీలో కాని, పార్టీలో కాని, అవమానకరంగా అంచెలంచెలుగా తగ్గించింది ఎవరు? పొమ్మనలేక పొగ పెట్టింది ఎవరు? అతిపెద్ద 2019 ఎన్నికల విజయం తర్వాత సజ్జల ప్రమేయం ఎలా శృతి మించింది? పార్టీకి నా సేవలు ఏంటి, సజ్జల ద్రోహం ఏంటి? పరిపాలన జగన్‌గారు చేశారా? “సజ్జల” సకల శాఖల మంత్రిగా, ఒక రాజ్యాంగేతర శక్తిగా తన ముఠాతో చేసిన పాలనలో జగన్‌ను ఎలా ఎవ్వరినీ కలవకుండా చేసింది? ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులకు సైతం అపాయింట్‌మెంట్లు లేకుండా గోడ కట్టింది ఈ సజ్జల కాదా?
కార్యకర్తలు, నాయకులు, పార్టీ కోసం పనిచేసేవారు ఈ సజ్జల కింద పని చేయాలా? ఇది జగన్‌ను నమ్మి పని చేద్దామని ఉన్న వారికి పట్టిన ఖర్మ కాదా? జగన్‌ను నమ్మి పని చేసే సీనియర్లు, నాయకులు, కార్యకర్తలు 2029లో మరోసారి పార్టీ ఓడిపోతే సజ్జలను తిట్టుకుంటూ రాజకీయాల నుంచి రిటైర్ అయిపోవాల్సిందేనా? నా సంగతి తర్వాత.. కుటుంబ సభ్యులు సైతం దూరం అయింది ఈ ప్రబుద్ధుడు సజ్జల వలన కాదా?
ఒక పెద్దిరెడ్డి గారు, ఒక బొత్స గారు, ఒక వై.వి. సుబ్బారెడ్డి గారు, ఒక మిథున్ రెడ్డి గారు, ఒక సాయిరెడ్డి అందరూ రీజినల్ కోఆర్డినేటర్స్‌గా, సజ్జలను రాష్ట్ర పార్టీ స్టేట్ కోఆర్డినేటర్‌గా మమ్మల్ని మానిటర్ చేయాలని, మేమంతా ఆయనకు రిపోర్ట్ చేయాలన్న ఆదేశాలు మిగతా నాయకులకు ఆమోదయోగ్యమో నాకు తెలియదు కానీ, నాకు మాత్రం కాదు. అందుకే నా ఆత్మగౌరవాన్ని చంపుకుని పని చేయలేక నాలుగేళ్ల రాజ్యసభ పదవీకాలాన్ని వదులుకొని, వైసీపీ గుర్తుపై ఎన్నికైనందుకు నైతిక సూత్రాన్ని పాటిస్తూ రాజీనామా చేయడం జరిగింది.
జగన్ గారిని నేను రెండు సంవత్సరాలు నోరు తెరచి ఒక్క మాట మాట్లాడలేదు. కోటరీ కారణంగా నాకు జరిగిన అవమానాల కారణంగా బయటకు వచ్చా అని పదేపదే చెప్పాను. అయినా, అదే కోటరీ వారంతా, ఈ రోజు నేను పార్టీ పెడతానంటే నన్ను విమర్శిస్తున్నారు … నేను నేరుగా గెలిచేందుకే ప్రజాస్వామ్యబద్ధంగా యుద్ధం చేస్తా… అంతే గాని… అప్పట్లో ప్రభుత్వాన్ని ఇప్పుడు పార్టీని కబ్జా చేసి … జగన్ గారిని రోజు మోసం చేస్తూ కోవర్ట్ రాజకీయం చేయడం నాకు చేత కాదు … ఇది విజయసాయి రెడ్డిగా నా మాట…
జగన్‌గారు పెట్టుకున్న రెండు అంచల వ్యవస్థలో అనేక విషయాల్లో నా ఆత్మాభిమానం మీద కొడుతుంటే తట్టుకోలేకపోయాను.
అంతకు ముందు, మంగళగిరిలో 2022లో జరిగిన పార్టీ ప్లీనరీలో నేరుగా ఈ సకల శాఖల మంత్రి నా మీద డైరెక్టుగా, భౌతికంగా దాడి చేస్తే జగన్ గారికి తెలిసి ప్రేక్షకపాత్ర వహించారు. ఈ విషయం పార్టీలో అక్కడున్న నాయకులు కూడా చూశారు.
ఇవన్నీ తెలిసి కూడా అప్పటికే అతడి చేతిలో బందీ అయిపోయిన జగన్‌గారు, నన్ను పూర్తిగా పక్కన పెట్టేందుకు, 2022లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమన్వయకర్తల మీటింగ్‌లో “సాయన్న వయసు అయిపోయింది – ముసలోడు అయిపోయాడు” అంటూ అనుబంధ సంఘాల ఇంచార్జ్ బాధ్యతలు తప్పిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా నుంచి తిరుపతి జిల్లా వరకు ఉన్న ఇంచార్జ్ బాధ్యతలను తప్పించారు. కోర్ కమిటీలోనుంచి తొలగించారు. నేను నమ్మకస్తుడినే అయినా నా మీద ఇలా టార్గెట్ చేయించటంలో కోటరీ సక్సెస్ అయ్యింది.
ఇలాంటి అవమానాలు మొత్తం 74 ఉన్నాయి. అవమానాలకు గురైనా, కడుపులోనే దాచుకున్న విషయాలు అనేకం ఉన్నాయి. 2020 వరకు జగన్‌గారి దృష్టిలో నా మాటకు ఎంతో విలువ ఉండేది. అదే కోటరీ కడుపు మంటకు కారణం అయింది. నేను ఎప్పుడూ కోటరీలో లేను. నేను ఢిల్లీలో జగన్‌గారి ఆదేశాల మేరకు పని చేయటంలో బిజీగా ఉంటే, సకల శాఖల మంత్రి జగన్‌గారితోనే ఉండి నన్ను పడగొట్టే కార్యక్రమంలో బిజీగా ఉండేవాడు.
ఇప్పుడు ఆ వైసీపీ పార్టీలో నంబర్ 2 ఎవరంటే జగన్‌గారు. ఇప్పుడు నంబర్ వన్ ఎవరంటే “సకల శాఖల మంత్రి సజ్జల”. ఆ పార్టీ గెలుస్తుందా… ఓడుతుందా ప్రజలు నిర్ణయిస్తారు. కానీ, నిరంతరం ఆ కొత్త నంబర్ వన్ గారి ఆజ్ఞలకు తలవంచి ఇప్పుడున్న సీనియర్ల మాదిరిగా నేను సర్దుకుపోలేను. అతనికి నమస్కారాలు/సాష్టాంగాలు/దండాలు పెట్టలేను. ఇక అక్కడ ఉండలేని పరిస్థితి వచ్చింది. 2024 ఎన్నికల తర్వాత, ఈ పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. అందువల్లే పార్టీకి, నా రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేశాను. ఇప్పుడు వేరే పార్టీ పెడుతున్నాను.
నేను జగన్‌గారికి నమ్మక ద్రోహం చేయలేదు, చేయను. పార్టీలో ఉండి, ఎవరు కోవర్టుగా పని చేస్తున్నారో, ఎవరు నమ్మక ద్రోహం చేస్తున్నారో వైయస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలు, జగన్‌గారి అభిమానులు ఆలోచన చేసుకోవాలి. ఈ నిజాలు చెప్పకపోతే, విమర్శలు మాత్రమే ప్రచారంలోకి వస్తున్నాయి. మరో సందర్భంలో మీడియా ద్వారా మరిన్ని నిజాలు తెలియజేస్తా.
https://www.facebook.com/share/p/1DPEMS74G5/













