బాపట్ల జిల్లాలో అక్రమ ఇసుక తవ్వకాలు, అక్రమ నిల్వలు, రవాణాపై సీనియర్ జర్నలిస్ట్ నాయుడు నాగార్జున రెడ్డి చేసిన ఫిర్యాదుపై కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆగస్టు 6న కేంద్రానికి సమర్పించిన ఫిర్యాదును ఆగస్టు 20న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గనుల శాఖ కార్యదర్శికి కేంద్రం పంపించింది. ఎంఎంఆర్‌డీ చట్టం–1957, సంబంధిత నిబంధనల ప్రకారం ఫిర్యాదులోని అంశాలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. తీసుకున్న చర్యల వివరాలను ఫిర్యాదుదారునికి తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. బాపట్ల, చీరాల, వేటపాలెం, చినగంజాం ప్రాంతాల్లో ప్రభుత్వ, అసైన్డ్, వాన్‌పిక్ భూములతో పాటు సాగునీటి కాలువలు, రైల్వే మార్గాల సమీప ప్రాంతాలు, వ్యవసాయ భూముల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఫిర్యాదులో ఆరోపించారు. ఉచిత ఇసుక విధానం దుర్వినియోగం, అక్రమ నిల్వలు, రవాణా, ప్రభుత్వ ఆదాయ నష్టం, పర్యావరణ నష్టంపై సమగ్ర విచారణ కోరారు. ఇప్పటికే విజిలెన్స్, గనులు–భూగర్భ వనరులు, రెవెన్యూ శాఖల తనిఖీల్లో పలు ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలు గుర్తించి డిమాండ్ నోటీసులు జారీ చేయడం, యంత్రాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే పూర్తి నష్టం రికవరీ, క్రిమినల్ చర్యలు, శాశ్వత నిరోధక చర్యలు అవసరమని నాగార్జున రెడ్డి కోరారు. ఇదే అంశంపై MOEAF/E/2026/0004321 నంబర్‌తో కేంద్ర ప్రజా ఫిర్యాదుల వ్యవస్థలోనూ ఫిర్యాదు నమోదైందని తెలిపారు. కేంద్ర సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కాలపరిమితితో బహుశాఖల విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తేవాలని, ప్రభుత్వానికి జరిగిన నష్టాన్ని పూర్తిగా రికవరీ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.












