Home AP పాలిటిక్స్‌లో నో లాయల్టీ.. పవర్ పోయాక తెలిసొచ్చింది రియాల్టీ

పాలిటిక్స్‌లో నో లాయల్టీ.. పవర్ పోయాక తెలిసొచ్చింది రియాల్టీ

పక్కనున్నవారు కొట్టేశారు పల్టీ.. జగన్‌కు వేస్తున్నారు పెనాల్టీ

ప్రత్యర్థులు జగన్‌ను విమర్శించడం కొత్త కాదు. చంద్రబాబు విమర్శిస్తారు. పవన్‌ కళ్యాణ్ విమర్శిస్తారు. బీజేపీ విమర్శిస్తుంది. కాంగ్రెస్‌ విమర్శిస్తుంది. అది రాజకీయ పోరాటం. కానీ ఒకప్పుడు జగన్‌ పక్కన నిలిచినవాళ్లు బయటకు వెళ్లి జగన్‌ వ్యవస్థలోని లోపాలనే బహిరంగంగా చెబుతుంటే.. అది కేవలం ప్రత్యర్థి ప్రచారంగా కొట్టిపారేయడం ప్రమాదకరం. విజయసాయి నమ్మకం గురించి మాట్లాడారు. రఘురామ నాయకత్వాన్ని బహిరంగంగా సవాలు చేశారు. కోటంరెడ్డి అనుమానాల గురించి మాట్లాడారు. బాలినేని ప్రాధాన్యం, రాజకీయ వ్యవహారాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదినారాయణరెడ్డి ఇప్పుడు ప్రత్యర్థి శిబిరం నుంచి జగన్‌ పాలనపై దాడి చేస్తున్నారు. షర్మిల కుటుంబం నుంచి రాజకీయ ప్రత్యర్థిగా మారారు. మరికొందరు తమ తమ కారణాలతో దూరమయ్యారు. వీళ్లలో ఎవరు నిజం చెప్పారు, ఎవరు రాజకీయ లాభం కోసం మాట్లాడారు అన్నది చరిత్ర నిర్ణయిస్తుంది. కానీ వాళ్లందరూ ఒకే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.. నాయకుడి చుట్టూ మనుషులు ఉండటం ఒకటి.. నాయకుడిని మనస్ఫూర్తిగా నమ్మి మనుషులు ఉండటం మరోటి. అధికారంలో ఉన్నప్పుడు చుట్టూ గుంపు ఉండటం నాయకత్వ బలం కాదు. అధికారం లేనప్పుడు కూడా ఆ గుంపులో ఎంతమంది నిలబడతారన్నదే అసలు బలం. పదవులు ఉన్నప్పుడు విధేయత కొనుక్కోవచ్చు. కానీ పదవులు లేని సమయంలో విశ్వాసాన్ని కొనలేం. అది సంపాదించాలి. అందుకే జగన్‌ నోట ‘విశ్వసనీయత’ అనే పదం ఇకపై ఎంతసార్లు వినిపిస్తుందన్నది ముఖ్యం కాదు. ఆయన చుట్టూ ఎంతమంది నిజం చెప్పే విశ్వసనీయ మనుషులు ఉంటారన్నదే ముఖ్యం. ఎందుకంటే విశ్వసనీయతను పదేపదే ఉచ్చరించాల్సిన అవసరం లేని నాయకుడి చుట్టూ.. ఆ పదం స్వయంగా కనిపిస్తుంది. లేకపోతే రాజకీయ చరిత్ర అడిగే ప్రశ్న మాత్రం మారదు జగన్‌ను నమ్మిన వాళ్లు ఎందుకు నిలబడలేదు? వాళ్లు అందరూ ద్రోహులేనా? లేక వాళ్లలో కొందరు వెళ్లిపోయేంతగా నాయకత్వం నుంచి దూరం ఏర్పడిందా? ఆ ప్రశ్నకు సమాధానం ప్రత్యర్థులు చెప్పాల్సిన అవసరం లేదు. జగన్‌తో కలిసి నడిచినవాళ్ల రాజకీయ ప్రయాణాలే చెబుతాయి. మరింత ముఖ్యంగా.. వాళ్లు జగన్‌ పక్కన ఉన్నప్పుడు చెప్పిన మాటలకూ, జగన్‌ను వీడి వెళ్లిన తర్వాత చెప్పిన మాటలకూ మధ్య ఉన్న దూరమే ‘విశ్వసనీయత’ అనే పదానికి అసలు పరీక్ష. అక్కడే జగన్‌ రాజకీయ కథలోని అసలు వైరుధ్యం బయటపడుతుంది. విశ్వసనీయతను కోరుకునే నాయకుడికి.. ముందుగా తన చుట్టూ ఉన్నవాళ్లు తనను నిజంగా నమ్మే వాతావరణాన్ని సృష్టించాలి. లేకపోతే విశ్వసనీయత నినాదంగా మిగులుతుంది.. నాయకత్వం మాత్రం అనుమానంగా మారుతుంది.

 

#YSJagan #JaganMohanReddy #YSRCP #AndhraPradeshPolitics #JaganPoliticalCrisis #PoliticalLoyalty #JaganFormerAllies #VijayasaiReddy #RaghuramaKrishnaRaju #Kotamreddy #Balineni #AdinarayanaReddy #YSSharmila #APPolitics #JaganLeadership #PoliticalNews