ప్రొద్దుటూరు: లైసెన్స్ లేని చేతుల్లో వాహనం పెడితే ప్రాణాలకే ప్రమాదమని ట్రాఫిక్ సీఐ భాస్కర్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు దీప్తి జూనియర్ కళాశాలలో శనివారం మైనర్ డ్రైవింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నిర్ణీత వయస్సు రాకముందే లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని విద్యార్థులకు వివరించారు. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. చిన్న నిర్లక్ష్యం కూడా ప్రమాదాలు, ప్రాణనష్టం, చట్టపరమైన సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. విద్యార్థులు డ్రైవింగ్‌పై ఆసక్తి కంటే చదువు, ఉన్నత విద్య, కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించారు. చట్టబద్ధమైన వయస్సు వచ్చిన తర్వాత లైసెన్స్ పొంది వాహనాలు నడపాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించి తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.












