సంగీత ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది. నిశ్శబ్దం ఆవరించింది. ఎన్నో తరాల భావోద్వేగాలకు ఊపిరిగా నిలిచిన ఆ మధుర స్వరం ఇక కొత్త పాటను పలకదు. వెండితెరపై వినిపించిన ప్రతి రాగం, ప్రతి పల్లవి, ప్రతి ఆలాపన ఇప్పుడు జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. దక్షిణ భారత సినీ సంగీతానికి చిరునామాగా నిలిచిన గాన కోకిల ఎస్. జానకి తన చివరి నిశ్వాసతో ఒక స్వర్ణయుగానికి తెరదించారు. ఆమె వెళ్లిపోయినా, లక్షలాది హృదయాల్లో మిగిలిన స్వరం మాత్రం ఎన్నటికీ అస్తమించదు. ఆనందానికి చిరునవ్వు, విషాదానికి కన్నీరు, ప్రేమకు పరవశం, భక్తికి పరిమళం ఇచ్చిన ఆ గాత్రం ఇప్పుడు సంగీత సరస్వతిలో లీనమైంది. గాయని మాత్రమే కాదు… ఒక యుగం ముగిసింది. కానీ ఆమె పాడిన ప్రతి పాట, ప్రతి స్వరం, ప్రతి భావం భారతీయ సంగీత చరిత్రలో శాశ్వతంగా మార్మోగుతూనే ఉంటుంది.
దక్షిణ భారత సినీ సంగీతానికి చిరునామాగా నిలిచిన ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి కన్నుమూశారు. 88 ఏళ్ల వయసులో శనివారం మైసూరులో ఆమె తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె మనవరాలు అప్సరా వైద్యులా కుటుంబ సభ్యుల తరఫున వెల్లడించారు. కుటుంబ సభ్యుల ప్రేమ మధ్య ప్రశాంతంగా ఆమె కన్నుమూశారని పేర్కొన్నారు. కోట్లాది మంది అభిమానులను తన మధుర గానంతో అలరించిన ఎస్. జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటుగా మారింది. ఆమె గాత్రం ఎన్నో తరాల భావోద్వేగాలకు చిరస్థాయి గుర్తుగా నిలిచిపోయింది.
ఆంధ్ర నేలలో పుట్టిన గాన కోకిల
ఎస్. జానకి 1938 ఏప్రిల్ 23న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో జన్మించారు. ఆమె తండ్రి సిస్ట్ల శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యుడు. ఉపాధ్యాయుడిగానూ సేవలందించారు. చిన్ననాటి ఎక్కువ కాలం సిరిసిల్లలో గడిచింది. కేవలం తొమ్మిదేళ్ల వయసులోనే వేదికపై తొలి గాన ప్రదర్శన ఇచ్చారు. నాదస్వర విద్వాంసుడు పైడిస్వామి వద్ద సంగీతానికి సంబంధించిన ప్రాథమిక అంశాలు నేర్చుకున్నారు. శాస్త్రీయ సంగీతంలో అధికారిక శిక్షణ లేకపోయినా, తన సహజ ప్రతిభతో భారత సంగీత చరిత్రలో అరుదైన స్థానం సంపాదించారు.
ఆరు దశాబ్దాల అపూర్వ గాన ప్రస్థానం
పదొమ్మిదేళ్ల వయసులోనే విధియిన్ విలయట్టు తమిళ చిత్రం ద్వారా నేపథ్య గాయనిగా ప్రయాణం ప్రారంభించారు. తొలి ఏడాదిలోనే ఆరు భాషల్లో పాటలు పాడి తన ప్రతిభను నిరూపించారు. ఆ తర్వాత ఆరు దశాబ్దాలకు పైగా వేలాది పాటలతో సంగీత ప్రపంచాన్ని అలరించారు. 2016లో సినీ గానానికి వీడ్కోలు ప్రకటించిన ఆమె, 2018లో పన్నాడి చిత్రం కోసం మరోసారి స్వరం అందించి అభిమానులను ఆనందపరిచారు. సుమారు 20 వేలకుపైగా పాటలను పలు భారతీయ భాషల్లో ఆలపించి అత్యంత ఎక్కువ పాటలు పాడిన గాయనుల్లో ఒకరిగా నిలిచారు.
పురస్కారాల సినీ ప్రస్థానం
ఎస్. జానకి నాలుగు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 33 చలనచిత్ర పురస్కారాలు అందుకుని అరుదైన ఘనత సాధించారు. 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని ఆమె తిరస్కరించారు. భారత సంగీతానికి చేసిన తన సేవలకు తగిన గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ఆమె అభిప్రాయపడ్డారు. కళాకారిణిగా మాత్రమే కాదు, తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకున్న వ్యక్తిగా కూడా ఆమె గుర్తింపు పొందారు.
కుటుంబానికి ప్రేమ.. అభిమానులకు ప్రేరణ
1959లో వి. రాంప్రసాద్‌ను వివాహం చేసుకున్న ఎస్. జానకి గాన ప్రయాణంలో ఆయన కీలకంగా నిలిచారు. రికార్డింగ్‌లకు ఆమెతో పాటు వెళ్లి పూర్తి సహకారం అందించేవారు. 1997లో ఆయన గుండెపోటుతో మరణించారు. కుటుంబ సభ్యుల ప్రేమను, అభిమానుల ఆదరణను సమానంగా గౌరవించిన జానకి జీవితమంతా నిరాడంబరంగా సాగింది. ప్రపంచానికి ఆమె గొప్ప గాయని అయితే, కుటుంబానికి ప్రేమతో నింపిన అమ్మమ్మగా చిరస్మరణీయమని ఆమె మనవరాలు భావోద్వేగంగా గుర్తుచేశారు.
ఎప్పటికీ నిలిచే అమర స్వరం
తెలుగు మాతృభాష అయినప్పటికీ తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ ఆమెకు అద్భుత పట్టు ఉండేది. ప్రతి భాషలో భావాన్ని సహజంగా పలికించిన గాత్రమే ఆమెను కోట్లాది మంది హృదయాల్లో నిలిపింది. ఎస్. జానకి ఇక మన మధ్య లేకపోయినా, ఆమె ఆలపించిన ప్రతి పాట సంగీత ప్రేమికుల హృదయాల్లో చిరకాలం మార్మోగుతూనే ఉంటుంది. ఒక గాయని వెళ్లిపోయినా, ఆమె స్వరం మాత్రం భారతీయ సంగీత చరిత్రలో శాశ్వతంగా జీవిస్తుంది.










