రాజీనామాతో తప్పించుకుంటే.
జడ్జీలపై సుప్రీంకోర్టు కీలక విచారణ.
అవినీతి, దుష్ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్యాంగ పదవుల్లోని వ్యక్తులు తొలగింపు ప్రక్రియను తప్పించుకునేందుకు రాజీనామా చేస్తే.. వారికి పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వకూడదా? అన్న అంశంపై సుప్రీంకోర్టు కీలకంగా స్పందించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కేంద్రం సమాధానం కోరింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు తమపై జరిగే పారదర్శక విచారణను ఎదుర్కోకుండా రాజీనామా చేసి ప్రయోజనాలు పొందడం సరికాదన్నది పిటిషనర్ ప్రతిక్ వోరా వాదన.
రాజీనామా.. తొలగింపుకు ప్రత్యామ్నాయం కాదు
ఒక వ్యక్తి ఎన్నికై లేదా నియమితుడై నిర్దిష్ట కాలానికి రాజ్యాంగ పదవిలోకి వస్తే.. ఆ పదవీకాలాన్ని పూర్తి చేయడం అతని రాజ్యాంగ బాధ్యత అని పిటిషన్ పేర్కొంది. తప్పు జరిగిందన్న ఆరోపణలు వస్తే వాటిపై పారదర్శకమైన విచారణ జరగాలి. వ్యక్తిగత ఇష్టానుసారం రాజీనామా చేసి ఆ ప్రక్రియ నుంచి బయటపడే అవకాశం ఉండకూడదని అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో రాజీనామా చేసినా గతంలో లభించే అన్ని ప్రయోజనాలు దక్కుతాయనే భావన కొందరికి విచారణను తప్పించుకునే ధైర్యాన్ని ఇస్తోందని పిటిషనర్ పేర్కొన్నారు. అందువల్ల తొలగింపు లేదా అవిశ్వాస ప్రక్రియను తప్పించుకునేందుకు రాజీనామా చేసే రాజ్యాంగ పదవీధారులకు పెన్షన్, ఇతర పదవీ ప్రయోజనాలు నిలిపివేయాలని కోరారు.
జస్టిస్ యశ్వంత్ వర్మ కేసుతో ప్రాధాన్యం
ఈ పిటిషన్‌కు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం నేపథ్యంలో మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీ హైకోర్టులో పనిచేసిన సమయంలో ఆయన అధికారిక నివాసంలో కాలిపోయిన నగదు కట్టలు లభించాయన్న ఆరోపణలపై విచారణ జరిగింది. అనంతరం ఆయనపై పార్లమెంటరీ తొలగింపు ప్రక్రియకు దారితీసింది. లోక్‌సభ కమిటీ ఆరోపణలు రుజువయ్యాయని పేర్కొన్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజీనామా ద్వారా విచారణను ముగించే అవకాశం ఉంటే రాజ్యాంగ వ్యవస్థపై ప్రజల నమ్మకానికి దెబ్బ తగులుతుందని పిటిషన్ చెబుతోంది. జడ్జీల విషయంలో జడ్జెస్ ఇన్క్వైరీ యాక్ట్ ప్రకారం ప్రక్రియ ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కోకుండా రాజీనామా చేయడం సమర్థనీయం కాదన్నది పిటిషనర్ వాదన. ఇప్పుడు కేంద్రం సమాధానం తర్వాత ఈ అంశంపై సుప్రీంకోర్టు ఎలాంటి దిశానిర్దేశాలు ఇస్తుందన్నది కీలకంగా మారింది.
#SupremeCourt #JudicialAccountability #JudgesResignation #PensionBenefits #ConstitutionalOffices #RemovalProceedings #JusticeYashwantVarma #JudgesInquiryAct #Judiciary #SupremeCourtNotice #LegalNews #IndianJudiciary #CentreGovernment #CourtNews #IndiaNews











