యూపీఐ మోతపై కేంద్రం స్పష్టత
ఒక్కసారి ఆలోచించండి.. జేబులో నగదు లేకపోయినా ఫర్వాలేదు. ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. టీ నుంచి కూరగాయల వరకు, హోటల్ బిల్లు నుంచి మెడికల్ షాప్ వరకు క్షణాల్లో చెల్లింపు అయిపోతోంది. ఇంత సులభంగా మారిపోయిన యూపీఐకి ఇప్పుడు ఛార్జీలు వస్తాయా? అనే వార్త సామాన్యుడిని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తోంది. “ఇప్పటివరకు ఫ్రీగా చేశాం.. ఇక ప్రతి చెల్లింపుకూ డబ్బులు కట్టాలా?” అనే భయం మొదలైంది. అయితే కేంద్రం చెబుతున్న మాట వేరుగా ఉంది. సాధారణ వినియోగదారులు చేసే యూపీఐ చెల్లింపులు, వ్యక్తిగత లావాదేవీలు ఉచితంగానే ఉంటాయని స్పష్టం చేసింది. అసలు మార్పు వ్యాపారుల విషయంలోనే. నిర్దిష్ట పరిమితికి మించిన కొన్ని వ్యాపార లావాదేవీలపై భవిష్యత్తులో స్వల్ప ఎండీఆర్ విధించే అవకాశం ఉందని కేంద్రం చెబుతోంది. కానీ వ్యాపారులపై పడే భారం చివరికి వస్తువుల ధరల్లో కలిసిపోతుందా? చిన్న వ్యాపారి కస్టమర్ నుంచి వసూలు చేస్తాడా? అనే ప్రశ్నలు మాత్రం సామాన్యుడి మనసులో మెదులుతున్నాయి. యూపీఐ ఫ్రీ అంటున్నారు.. మరి ఆ ఫీజు భారం చివరకు ఎవరి జేబుపై పడుతుంది? ఇదే ఇప్పుడు అసలు గోస.
యూపీఐ వాడుతున్న కోట్లాది మందికి కేంద్ర ప్రభుత్వం కీలక భరోసా ఇచ్చింది. సాధారణ వినియోగదారులు చేసే యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీ ఉండదని స్పష్టం చేసింది. వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే చెల్లింపులు కూడా ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది. అయితే భవిష్యత్తులో కొన్ని వ్యాపార లావాదేవీలపై స్వల్ప మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధించే అవకాశం ఉందని కేంద్రం వెల్లడించింది.
అందరికీ కాదు.. కొందరు వ్యాపారులకే
ప్రతిపాదిత ఎండీఆర్ అన్ని వ్యాపార లావాదేవీలకు వర్తించదు. నిర్దిష్ట పరిమితికి మించిన కొన్ని వ్యాపార చెల్లింపులపైనే నామమాత్రపు రుసుము విధించే అవకాశం ఉంటుంది. డెబిట్, క్రెడిట్ కార్డులపై ప్రస్తుతం ఉండే ఎండీఆర్తో పోలిస్తే ఈ ఛార్జీ చాలా తక్కువగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అత్యధిక యూపీఐ లావాదేవీలు ఇప్పటికీ ఉచితంగానే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇక్కడ మరో కీలక విషయం ఉంది. ప్రస్తుతం యూపీఐపై ఎలాంటి కొత్త ఛార్జీ విధించడం లేదు. 2026 పన్నుల, ఇతర చట్టాల సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఎండీఆర్ విధించాలా? ఎంత విధించాలి? ఏ లావాదేవీలకు వర్తింపజేయాలి? అనే అంశాలను ఎన్పీసీఐ నేతృత్వంలోని యూపీఐ, సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయిస్తుంది.
వ్యాపారులపై ఎంత భారం?
యూపీఐ వినియోగం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ భద్రత, మోసాల నివారణ, సాంకేతిక మౌలిక వసతుల కోసం నిరంతరం పెట్టుబడులు అవసరమని కేంద్రం చెబుతోంది. కేవలం ప్రభుత్వ సబ్సిడీలపై ఆధారపడటం దీర్ఘకాలంలో సాధ్యం కాదని పేర్కొంది. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలంగా, సురక్షితంగా కొనసాగించేందుకు స్థిరమైన ఆదాయ విధానం అవసరమని వివరించింది. ప్రభుత్వం ప్రతిపాదనను అమలు చేస్తే పెద్ద మొత్తంలో యూపీఐ చెల్లింపులు స్వీకరించే కొన్ని వ్యాపార సంస్థలపై స్వల్ప ఎండీఆర్ పడే అవకాశం ఉంది. అయితే ఆ భారాన్ని వ్యాపారులు వినియోగదారులపైకి బదిలీ చేస్తారా? అనే ప్రశ్న కూడా ముందుకు వస్తోంది. ప్రస్తుతం మాత్రం కస్టమర్ చేసే సాధారణ యూపీఐ చెల్లింపులు ఉచితంగానే ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది.
యూపీఐ ఉచితమే.. కానీ డౌట్స్
ఎండీఆర్ భారం చివరికి సాధారణ ప్రజలపై పడే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి కేంద్రం స్పందిస్తూ.. ఎండీఆర్ నేరుగా కస్టమర్లపై విధించే ఛార్జీ కాదని పేర్కొంది. బ్యాంకులు, ఫిన్టెక్ సంస్థలు మౌలిక వసతులు, సాంకేతికత, భద్రతపై మరింత పెట్టుబడి పెట్టేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని కేంద్రం చెబుతోంది. ప్రస్తుతానికి సామాన్య వినియోగదారులకు యూపీఐ చెల్లింపులు ఉచితమే. వ్యక్తిగత చెల్లింపులపై కూడా ఎలాంటి రుసుము ఉండదు. అయితే భవిష్యత్తులో కొన్ని వ్యాపార లావాదేవీలకు ఎండీఆర్ విధించే అవకాశం కోసం ప్రభుత్వం చట్టపరమైన మార్గాన్ని సిద్ధం చేస్తోంది. అంటే యూపీఐకి పూర్తిగా ఛార్జీలు వస్తున్నాయన్నది నిజం కాదు.. కానీ వ్యాపార లావాదేవీలపై స్వల్ప ఫీజుకు తలుపులు మాత్రం తెరుచుకున్నాయి.
#UPICharges #UPIFees #UPITransactionCharges #UPIMDR #MerchantDiscountRate #UPIPayments #DigitalPaymentsIndia #NPCI #UPIRules #UPINews #MerchantCharges #UPIPaymentFees #OnlinePayments #DigitalPaymentCharges #UPIUsers #IndiaDigitalEconomy











