Home Telangana క్షుద్ర రాజకీయాలు చేస్తోంది కాంగ్రెస్సే అలాంటి అవసరం బీఆర్ఎస్‌కు లేదు

క్షుద్ర రాజకీయాలు చేస్తోంది కాంగ్రెస్సే అలాంటి అవసరం బీఆర్ఎస్‌కు లేదు


మా పోరాటమంతా తెలంగాణ నీటి కోసమే.
కాంగ్రెస్ తీరుతో నీటి వాటాల్లో అన్యాయం.
సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డ కేటీఆర్.

తెలంగాణ కోసం పోరాడిన తమకు క్షుద్ర రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్‌ మాత్రం క్షుద్రపూజల పేరుతో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. హరీశ్‌రావు గుడికి వెళ్తే తప్పేముందని ప్రశ్నిస్తూ.. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు.

నీళ్ల విషయంలో రాజీ ఉండదు

తెలంగాణ నీటి వాటాలకు ఎలాంటి నష్టం జరిగినా రాష్ట్రం మరోసారి భగ్గుమంటుందని కేటీఆర్‌ హెచ్చరించారు. వచ్చే వారం జరగనున్న జీఆర్ఎంబీ సమావేశం ఎజెండాపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆ ఎజెండా తెలంగాణ హక్కులకు నష్టం చేసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడిన తెలంగాణలో మరోసారి నీటి హక్కుల కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వస్తే బీఆర్ఎస్‌ వెనుకడుగు వేయదని స్పష్టం చేశారు.

పంపులు ఎందుకు ఆన్ చేయలేదు?

వర్షాలు కురుస్తున్న సమయంలో పక్క రాష్ట్రాలు నీటిని ఎత్తిపోసుకుంటున్నా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. రైతులకు ఎప్పుడు నీరు అవసరమో ప్రభుత్వానికి తెలియడం లేదని విమర్శించారు. తాము డిమాండ్‌ చేసిన తర్వాతే పంపులు ఆన్‌ చేశారని అన్నారు. నార్లాపూర్‌ వద్ద పంపులు ఆన్‌ చేయాలని బీఆర్ఎస్‌ హెచ్చరించిన తరువాత ప్రభుత్వం స్పందించిందని పేర్కొన్నారు.

రేవంత్‌ విధానాలపై ఆరోపణలు

రైతులకు 24 గంటల విద్యుత్‌ అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న మాటల్లో నిజం లేదని కేటీఆర్‌ ఆరోపించారు. రోజులో పలుమార్లు విద్యుత్‌ కోతలు ఉంటున్నాయని విమర్శించారు. ఏ సబ్‌స్టేషన్‌కైనా రావడానికి తాము సిద్ధంగా ఉన్నామని, 24 గంటల విద్యుత్‌ ఎక్కడ అందుతుందో ప్రభుత్వం చూపించాలని సవాల్‌ చేశారు. హైడ్రా విషయంలో కోర్టులు చెప్పిన అంశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్‌ విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక ఆలోచనా విధానంతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్‌ ప్రభుత్వ హయాంలో 58 జీవో ద్వారా సుమారు రెండున్నర లక్షల మందికి పట్టాలు ఇచ్చామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పట్టా కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు.

భూములపై సంచలన ఆరోపణలు

హైదరాబాద్‌లోని పారిశ్రామిక భూములకు సంబంధించి ప్రభుత్వం భారీ స్థాయి అక్రమాలకు పాల్పడుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. సుమారు 10 వేల ఎకరాల విలువైన భూముల వ్యవహారంలో రూ.5 లక్షల కోట్ల స్కామ్‌ ఉందని ఆరోపిస్తూ.. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. లేఖలు, ప్రజెంటేషన్ల ద్వారా ప్రభుత్వ విధానాలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు.

సలహాదారుడి నియామకంపై అభ్యంతరం

తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడం సరికాదని కేటీఆర్‌ విమర్శించారు. తెలంగాణలో నిపుణుల కొరత ఉందా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రభావంలో తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందంటూ ఆరోపించారు. సంబంధిత సలహాదారుడిని వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేశారు.

మరో ఉద్యమానికి హెచ్చరిక

కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకుంటే తిరుగుబాటు తప్పదని కేటీఆర్‌ హెచ్చరించారు. తెలంగాణ నీటి వాటాల్లో అన్యాయం జరిగితే గత ఉద్యమాన్ని మించిన స్థాయిలో ఆందోళన వస్తుందని స్పష్టం చేశారు. జీఆర్ఎంబీ సమావేశాన్ని ప్రభుత్వం బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. రాష్ట్ర నీటి హక్కులను కాపాడే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సమాధానం చెప్పాలని కేటీఆర్‌ కోరారు.

 

#KTR #KTRamaRao #RevanthReddy #TelanganaPolitics #BRS #CongressTelangana #TelanganaWaterRights #GRMB #TelanganaWaterDispute #KrishnaGodavariWater #HarishRao #TelanganaIrrigation #TelanganaFarmers #TelanganaPoliticalNews #BRSNews #KTRLatestNews