ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంత్రి నారా లోకేశ్ శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. ఇటీవల ముంబయిలో కుడి భుజానికి రొటేటర్ కఫ్ గాయానికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కనకదుర్గ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేసి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలోకి తిరిగి రావాలని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలను తప్పకుండా పాటించాలని, పూర్తిస్థాయిలో కోలుకునే వరకు తగిన విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనంతరం ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్న లోకేశ్, పవన్ అన్న త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజా సమావేశాల సమయంలో అభిమానులు పదేపదే చేయి పట్టుకోవడంతో పవన్ కుడి భుజానికి తీవ్ర గాయం కావడంతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు.











