Home AP గాంధీ జయంతికల్లా చెత్తకు గుడ్‌బై

గాంధీ జయంతికల్లా చెత్తకు గుడ్‌బై

10



గాంధీ జయంతి నాటికి రాష్ట్రాన్ని చెత్త రహితంగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుడివాడలో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చెత్తను సమస్యగా కాకుండా సంపదగా మార్చాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంట్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 108 సమగ్ర ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటుకు రూ.528 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. ఆగస్టు 26 నాటికి 1,140 ఎలక్ట్రిక్ చెత్త సేకరణ వాహనాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

కాలుష్యం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్న సీఎం, ప్రతి కుటుంబం చెత్త నిర్వహణలో భాగస్వామ్యం కావాలని కోరారు. తడి చెత్తతో కంపోస్ట్ తయారు చేసుకోవాలని సూచించారు. ఈ నెలలోనే ‘తల్లికి వందనం’ పథకం నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. రౌడీయిజానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని హెచ్చరించారు. ప్రజల జీవితాలతో ఆటలాడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో అమృత్ 2.0 శిలాఫలకాన్ని ఆవిష్కరించి స్వచ్ఛ అవార్డులు అందజేశారు. అమరావతి అభివృద్ధికి సాయిశ్వేత తన బంగారు గాజులు విరాళంగా ఇవ్వగా, గుడివాడ ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధికి అన్నే నరసింహారావు దంపతులు రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు.