టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర… ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీ స్కెచ్

21

తమిళనాడు రాజకీయంలో ప్రకంపనలు
టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర
ఎమ్మెల్యేల కొనుగోలుకు భారీ స్కెచ్

తమిళనాడులో అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న కుట్రలు సంచలనం సృష్టిస్తున్నాయి. సుమారు 15 మంది టీవీకే ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, ప్రస్తుత ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ కుట్రపూరిత వ్యవహారంలో ప్రధాన ప్రతిపక్షం డీఎంకేకు చెందిన మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు అంతర్గత భద్రతా విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు ఈ రహస్య ఆపరేషన్‌పై అత్యంత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

కోట్లలో ఆఫర్ ఇచ్చిన కన్సల్టెన్సీ సంస్థ
ఈ భారీ కుట్రకు సంబంధించిన వివరాలు టీవీకే పార్టీ ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో అధికారికంగా వెలుగులోకి వచ్చాయి. చెన్నైకి చెందిన ఐపీడీఎస్ కన్సల్టెన్సీ ఫామ్ ఉద్యోగి తనను సంప్రదించాడని ఇళయరాజా పోలీసులకు వివరించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేలా చూడాలని, దానికి అనుకూలంగా ఓటు వేస్తే ఏకంగా 35 కోట్ల నుండి 50 కోట్ల రూపాయల వరకు ఇస్తామని ఆశ చూపినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ రహస్య ఒప్పందం గురించి ఎవరికీ చెప్పవద్దని వారు హెచ్చరించినట్లు ఫిర్యాదులో వెల్లడించారు.

రంగంలోకి పోలీసులు ముగ్గురు అరెస్ట్
ఎమ్మెల్యే ఫిర్యాదును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చెన్నై పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఐపీడీఎస్ కన్సల్టెన్సీ ఫామ్ ప్రతినిధులను వెంబడించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితులు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీతో పాటు అతని సోదరుడు అశోక్ కుమార్‌కు అత్యంత సన్నిహితులుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో డీఎంకే అగ్రనాయకత్వంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. నిందితులను విచారించడం ద్వారా ఈ కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీస్తామని పోలీసులు స్పష్టం చేశారు.

డీఎంకే నాయకత్వంపై మంత్రి తీవ్ర ధ్వజం
ఈ పరిణామాలపై తమిళనాడు చట్ట శాఖ మంత్రి సీటీ నిర్మల్ కుమార్ తీవ్రంగా స్పందించారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ కలిసి సెంథిల్ బాలాజీకి ఈ బాధ్యతలు అప్పగించారని ఆయన ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో వేల కోట్లు లూటీ చేసిన డీఎంకే నేతలు, ఇప్పుడు అధికార దాహంతో దొడ్డిదారిన ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారని మండిపడ్డారు. తమ టీవీకే ఎమ్మెల్యేలు కేవలం మూడు, నాలుగు లక్షలు ఖర్చు పెట్టి ప్రజాబలంతో గెలిచారని, డీఎంకే లాగా నోటుకు రెండు వేలు పంచలేదని నిర్మల్ కుమార్ గుర్తుచేశారు. కుట్రదారులపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.