Home Telangana పనితీరుకు ప్రాధాన్యం త్వరలో పదవుల పందేరం

పనితీరుకు ప్రాధాన్యం త్వరలో పదవుల పందేరం

9


ఈ నెలలోనే 50 నామినేటెడ్ పోస్టులు.
టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన!

ఈ నెలలోనే 50 నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. హైదరాబాద్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన ఈ విషయం వెల్లడించారు. గతంలో సమర్థంగా పనిచేసిన వారికి మళ్లీ అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పదవుల కేటాయింపులో పనితీరుకే అధిక ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు.

డీసీసీల పనితీరుపై సమీక్ష

డీసీసీ అధ్యక్షుల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నామని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆశించిన స్థాయిలో పని చేయని డీసీసీలను మార్చే అవకాశం కూడా ఉందన్నారు. మండల కమిటీల ఏర్పాటు విషయంలో డీసీసీల నివేదికలే కీలకమని చెప్పారు. పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.
పార్టీ పదవుల అంశంపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో ఇప్పటికే చర్చించినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై తదుపరి నిర్ణయాలపై చర్చిస్తామని చెప్పారు. పాత పదవులను పునరుద్ధరించే అంశంపై ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని వివరించారు.

రేణుక వ్యాఖ్యలపై వివరణ

ఎంపీ రేణుకా చౌదరితో తాను మాట్లాడినట్లు మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆమె వ్యాఖ్యల అసలు ఉద్దేశాన్ని వక్రీకరించి ప్రచారం చేశారని చెప్పారు. ఖమ్మంలో బీజేపీ, బీఆర్ఎస్ పరిస్థితిపై ఆమె చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించారు. మిత్రపక్ష నేత కూనంనేనితో తమకు ఎలాంటి విభేదాలు లేవని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. స్థానిక సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించుకోవాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ప్రతి చిన్న అంశాన్ని గాంధీభవన్‌కు తీసుకురావడం అవసరం లేదన్నారు. నలుగురు, ఐదుగురు మినహా మిగతా డీసీసీ అధ్యక్షుల పనితీరు సంతృప్తికరంగా ఉందని పేర్కొన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సమన్వయంతో ముందుకు సాగుతామని ఆయన స్పష్టం చేశారు.