Home AP స్టార్ హీరోలకు హితవు ఏపీ మీద ప్రేమ లేదా?

స్టార్ హీరోలకు హితవు ఏపీ మీద ప్రేమ లేదా?

8


రాష్ట్రంలో షూటింగ్స్ చేయాలి.
అంబికా కృష్ణ సంచలన వ్యాఖ్యలు .

ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ బలోపేతం కావాలంటే అగ్రహీరోలు తమ చిత్రాల షూటింగ్‌లను రాష్ట్రంలో నిర్వహించాలని సినీ నిర్మాత, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ పిలుపునిచ్చారు. ప్రతి స్టార్ హీరో తన సినిమా కోసం కనీసం రెండు షెడ్యూళ్లైనా ఆంధ్రప్రదేశ్‌లో ప్లాన్ చేస్తే రాష్ట్రంలో సినీ రంగానికి కొత్త ఊపు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏలూరులో మాట్లాడిన అంబికా కృష్ణ, రాష్ట్రంలో చిత్రీకరణలు పెరిగితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. సినీ పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడిన లైట్ బాయ్స్, జూనియర్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు, రవాణా రంగం, హోటళ్లు, క్యాటరింగ్ సేవలు సహా అనేక వర్గాలకు పని దొరుకుతుందని వివరించారు. షూటింగ్‌లు పెరగడం వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని చెప్పారు. ఈ దిశగా నటుడు నందమూరి బాలకృష్ణ ఇప్పటికే మంచి ప్రారంభం చేశారని అంబికా కృష్ణ పేర్కొన్నారు. అదే తరహాలో మిగిలిన అగ్రహీరోలు కూడా తమ సినిమాల చిత్రీకరణకు ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

రాష్ట్రంలో సముద్ర తీరాలు, కొండలు, అడవులు, నదీ తీరాలు వంటి అద్భుతమైన సహజ చిత్రీకరణ ప్రాంతాలు ఉన్నాయని, వాటిని సినీ పరిశ్రమ మరింతగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నంది అవార్డుల నిర్వహణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిరిగి ప్రారంభించాలని కూడా అంబికా కృష్ణ విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత సినిమాల్లో ఆంధ్ర ప్రాంత భాష, యాస క్రమంగా కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక భాష, సంస్కృతి, యాసలకు దర్శకులు, రచయితలు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కువగా షూటింగ్‌లు జరిగితే ఆంధ్రప్రదేశ్ సంస్కృతి, భాషకు జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.