శాస్త్రవేత్తల రాజీనామాలపై ఆందోళన.
సైంటిస్టుల విషయంలో కేంద్రం కఠినం.
దేశ అంతరిక్ష కార్యక్రమాలకు ఎదురవుతున్న సవాళ్ల నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తల రాజీనామాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. గగన్‌యాన్‌తో పాటు కీలక అంతరిక్ష ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఇకపై సాధారణంగా రాజీనామా చేయడం, స్వచ్ఛంద పదవీ విరమణ పొందడం సాధ్యం కాదు. అలాంటి ప్రతి దరఖాస్తును అంతరిక్ష శాఖే పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల ఇస్రోకు చెందిన అత్యంత కీలక కేంద్రాల నుంచి సుమారు వంద మంది శాస్త్రవేత్తలు వైదొలగడం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.
జాతీయ ప్రాజెక్టుల రక్షణే లక్ష్యం.
గగన్‌యాన్, ఉపగ్రహ ప్రయోగాలు, భవిష్యత్ అంతరిక్ష మిషన్లు దేశ ప్రతిష్ఠకు సంబంధించినవని ప్రభుత్వం భావిస్తోంది. అనుభవజ్ఞులైన శాస్త్రవేత్తలు ఒక్కసారిగా సంస్థను వీడితే ప్రాజెక్టుల అమలు దెబ్బతింటుందని అంతరిక్ష శాఖ పేర్కొంది. కీలక సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం కోల్పోవడం వల్ల జాతీయ ప్రాధాన్య కార్యక్రమాలు ఆలస్యమయ్యే ప్రమాదం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే నిష్క్రమణపై ప్రత్యేక నియంత్రణలు తీసుకొచ్చారు.
విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
కొత్త నిబంధులపై కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగం మార్చుకునే స్వేచ్ఛ ప్రతి ఉద్యోగికి ఉండాలని, కఠిన ఆంక్షలు ప్రతిభావంతులలో అసంతృప్తిని పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వ వర్గాలు మాత్రం దేశ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేస్తున్నాయి. ప్రతిభను నిలబెట్టుకోవడం, జాతీయ అంతరిక్ష కార్యక్రమాలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని పేర్కొంటున్నాయి.











