సెప్టెంబర్ 16 వరకు అవకాశమిచ్చిన సర్కార్.
ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన పేదలకు సామాజిక భద్రత మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్తగా పింఛన్ల కోసం సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్ పొందని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, కల్లుగీత కార్మికులు, డప్పు కళాకారులు, ట్రాన్స్‌జెండర్లు తదితర వర్గాలకు ఇది మరో అవకాశం. రాష్ట్రంలోని స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆధార్, రైస్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత కేటగిరీకి అవసరమైన ప్రత్యేక పత్రాలను సమర్పించాలి. దరఖాస్తు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత ఈ-కేవైసీ పూర్తి చేస్తారు. సెప్టెంబర్ 17–21 వరకు అర్హత పరిశీలన, 22–24 వరకు భౌతిక ధృవీకరణ, 25–26 వరకు బడ్జెట్ ప్రతిపాదనలు, ప్రభుత్వ ఆమోద ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత అర్హులైన వారికి దశలవారీగా పింఛన్లు మంజూరు చేస్తారు.
62 లక్షల కుటుంబాలకు ఆర్థిక భరోసా
ప్రస్తుతం రాష్ట్రంలో 61,92,396 మంది పింఛనుదారులకు ప్రతి నెల రూ.2,694 కోట్ల మేర పింఛన్లు అందుతున్నాయి. రాష్ట్ర జనాభాలో సుమారు 12.88 శాతం మంది సామాజిక భద్రత పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. పింఛన్ మొత్తం, లబ్ధిదారుల సంఖ్య, నెలవారీ వ్యయం, వార్షిక కేటాయింపుల పరంగా దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని ప్రభుత్వం పేర్కొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు పింఛన్ల కోసం రూ.73,508 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. ప్రస్తుతం వృద్ధులు, వితంతువులకు నెలకు రూ.4,000, దివ్యాంగులకు రూ.6,000, కొన్ని తీవ్ర అనారోగ్య వర్గాలకు రూ.10,000, పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.15,000 వరకు అందిస్తున్నారు. దాదాపు 28 కేటగిరీలకు పింఛన్లు అందిస్తూ ప్రతి నెలా ఒకటో తేదీని ప్రభుత్వం పేదల పండుగగా మార్చిందని తెలిపింది. ఇప్పటికే 62 లక్షల మందికి చేరిన సామాజిక భద్రతను కొత్త అర్హులకు విస్తరించడం ఈ తాజా నిర్ణయం ప్రధాన లక్ష్యం.
#APNewPensions #NTRBharosaPension #NTRBharosa #AndhraPradesh #APPensionScheme #NewPensionApplications #APPensions2026 #SocialSecurityPensions #PensionSchemeAP #ElderlyPension #WidowPension #DisabilityPension #SingleWomenPension #APGovernment #ChandrababuNaidu #APGovernmentSchemes #PensionBeneficiaries











