Home AP గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త ఊపు

గోదావరి డెల్టాకు శాశ్వత రక్షణ ధవళేశ్వరం బ్యారేజీకి కొత్త ఊపు

14


ఇరిగేషన్‌పై భారీ పెట్టుబడులు
రైతు భరోసాకు చంద్రబాబు హామీ

గోదావరి డెల్టాకు శాశ్వత భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రూ.152.95 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులకు శ్రీకారం చుట్టారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. వచ్చే ఏడాది జూన్ నాటికి గేట్ల బిగింపు పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పనులు పూర్తవుతాయని అధికారులు సీఎంకు హామీ ఇచ్చారు.

డెల్టాకు శాశ్వత రక్షణ

ధవళేశ్వరం బ్యారేజీ గోదావరి డెల్టాకు జీవనాడిగా నిలిచిందని చంద్రబాబు చెప్పారు. ఈస్టర్న్, సెంట్రల్, వెస్టర్న్ డెల్టాల్లో కలిపి 10.13 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోందని గుర్తు చేశారు. ఐదు దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న గేట్లు, మోటార్లు, విద్యుత్ వ్యవస్థలు పాతబడటంతో ఆధునీకరణ అత్యవసరమైందన్నారు. కాల్వల చివరి భూముల వరకు నీరు చేరేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ఇరిగేషన్‌కు రూ.24 వేల కోట్లు

గత రెండేళ్లలో సాగునీటి రంగానికి రూ.24 వేల కోట్లు ఖర్చు చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రకటించిన క్యాలెండర్‌కు అనుగుణంగానే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుతం 89 శాతం పూర్తయిందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే 2021 నాటికే పోలవరం పూర్తయ్యేదని పేర్కొన్నారు. నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

రైతులకు అండగా ప్రభుత్వం

ఒకప్పుడు కోనసీమ రైతులు క్రాప్ హాలిడే ప్రకటించే పరిస్థితి ఉండేదని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రస్తుతం రైతులు విక్రయించిన ధాన్యానికి 24 గంటల్లోనే నగదు ఖాతాల్లో జమ చేస్తున్నామని చెప్పారు. అన్నదాత సుఖీభవ వంటి పథకాల ద్వారా రైతులకు పూర్తి భరోసా కల్పిస్తున్నామని వెల్లడించారు. పోలవరం పూర్తయితే గోదావరి జిల్లాల్లో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని తెలిపారు.

అభివృద్ధితో పాటు పర్యాటకానికి ప్రాధాన్యం

గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని సీఎం చెప్పారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల్లో రూ.1,200 కోట్లతో మౌలిక వసతులు అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. పిచ్చుకలంక, బొబ్బర్లంకలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కోనసీమకు రైల్వే మార్గం తీసుకురావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. కోవ్వూరులో కోకో సిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

గొడ్డలి పార్టీపై తీవ్ర విమర్శలు

రాష్ట్రంలో అభివృద్ధికి అడ్డంకులు సృష్టించేందుకు గొడ్డలి పార్టీ ప్రయత్నిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. డబ్బులు ఇచ్చి అరాచకాలు చేయిస్తున్నారని విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేసే వారిపై, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసే వారిపై, గంజాయి, రౌడీయిజాన్ని ప్రోత్సహించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం, రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి మరోసారి వెల్లడించారు.