Home AP ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు 33 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు 33 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్


అభివృద్ధి, మౌలిక వసతులపై ఫోకస్.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన 54వ మంత్రిమండలి సమావేశంలో మొత్తం 33 కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. సమావేశం అనంతరం మంత్రి కొలుసు పార్థసారధి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. విశాఖ వెలంపేట మురికివాడ పునరాభివృద్ధిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, పాదచారుల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ పెడెస్ట్రియన్ సేఫ్టీ పాలసీ–2026 అమలు చేయాలని నిర్ణయించారు. ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపు, బ్లాక్‌స్పాట్‌ల అభివృద్ధి, సీసీ కెమెరాల పర్యవేక్షణ, రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. దిశ బిల్లును ఉపసంహరించుకోవడానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన కొత్త క్రిమినల్ చట్టాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50 విద్యుత్ రాయితీ కొనసాగిస్తూ దాదాపు రూ.1,150 కోట్ల సబ్సిడీ అందించాలని నిర్ణయించింది.

అమరావతి, పెట్టుబడులు, ఉపాధిపై నిర్ణయాలు

అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమరావతి ఐ ప్రాజెక్టును పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి టెండర్లు తిరిగి పిలవాలని నిర్ణయించింది. క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్, ట్విన్ ఆఫీస్ టవర్స్, హైకోర్టు, శాసనసభ నిర్మాణాలకు అవసరమైన కన్సల్టెన్సీ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. గుంటూరు జిల్లా మోతడకలో కొత్త రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్ కోసం ల్యాండ్ పూలింగ్‌కు అనుమతి ఇచ్చింది. గోదావరి పుష్కరాల దృష్ట్యా రూ.210 కోట్లతో 238 స్నాన ఘట్టాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. హంద్రీ–నీవా ప్రాజెక్టు మిగిలిన పనులకు రూ.600 కోట్ల పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ టవర్ల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని అద్దె లేకుండా ఇవ్వాలని నిర్ణయించింది.

పరిశ్రమలు, విద్య, పాలనలో సంస్కరణలు

పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించే లక్ష్యంతో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చట్టం–2026, కొత్త పీపీపీ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో రూ.1.23 లక్షల కోట్ల విలువైన పీపీపీ ప్రాజెక్టులను వేగవంతం చేయడానికి రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు. రెండు కొత్త ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు అనుమతి ఇవ్వడంతో పాటు, కొత్త జిల్లాలకు అనుగుణంగా 15 జిల్లా విద్యాశాఖాధికారి పోస్టులను సృష్టించాలని నిర్ణయించారు. వాటిలో 50 శాతం పోస్టులను గ్రూప్–1 ద్వారా భర్తీ చేయనున్నారు. సోలార్ ప్రాజెక్టుల కోసం భూముల కేటాయింపు, పారిశ్రామిక పార్కులకు విద్యుత్ రాయితీలు, శ్రీ సిటీ నీటి సరఫరా, వివిధ పట్టణాభివృద్ధి సంస్థల పునర్వ్యవస్థీకరణ, పలు ప్రభుత్వ భూముల బదిలీలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాలు రాష్ట్రంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పరిపాలనా సంస్కరణలకు ఊతమిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

 

#APCabinet #AndhraPradesh #ChandrababuNaidu #Amaravati #Infrastructure #Development #CabinetDecisions #QuantumValley #AquaFarmers #PedestrianSafety #PPPProjects #EaseOfDoingBusiness #HandriNeeva #GodavariPushkaralu #IndustrialDevelopment #APNews #TeluguNews #Governance #PublicPolicy #Investments