సీపీఎస్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం రెండు అతిపెద్ద నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ తాజా నిర్ణయాన్ని ఏపీ సచివాలయ సీపీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ పూర్తిగా స్వాగతించింది. జీవో నంబర్ 57 అమలు చేయాలని తీసుకున్న నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల రాష్ట్రంలో దాదాపు పదకొండు వేల మంది ఉద్యోగులకు నేరుగా లబ్ధి చేకూరనుంది. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న ఒక పెద్ద సమస్యకు కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం చూపించింది.
పాత పెన్షన్ విధానానికి అవకాశం
భారత ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ అంటే పాత పెన్షన్ విధానం ఎంచుకునేందుకు ఒకే ఒక్క అవకాశం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. సెప్టెంబర్ 1, 2004 కంటే ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలై ఆ తర్వాత విధుల్లో చేరిన వారికి ఈ సువర్ణ అవకాశం లభిస్తుంది. దీనివల్ల 10,715 మంది ఉద్యోగులు, వారి కుటుంబాలకు పదవీ విరమణ తర్వాత సామాజిక భద్రత పెరుగుతుంది. ఉద్యోగుల గ్రాడ్యుటీ మేరకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయడానికి కూడా సర్కార్ ఆమోదం తెలిపింది.
పదవీ విరమణ వయసు పెంపు
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని జనవరి 1, 2022 నుంచి పాత తేదీ ప్రకారం అమలు చేయనున్నారు. ఆ తేదీ తర్వాత రిటైర్ అయిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకునేలా సేవా నిబంధనలను సవరించనున్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాల పట్ల ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీ అంశాన్ని కూడా సీఎం పరిశీలించాలని కోరారు.
సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు
కేబినెట్ సమావేశంలో ఉద్యోగులకు మేలు చేసేలా తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీల్లో ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62కు పెంపు, 2004 సెప్టెంబర్ కు ముందు నోటిఫికేషన్లతో నియామకమైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలకు చెందిన ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
#APCabinet #CPSEmployees #OldPensionScheme #OPS #APGovernment #ChandrababuNaidu #PawanKalyan #NaraLokesh #EmployeeWelfare #RetirementAge #APEmployees #GovernmentEmployees #GO57 #AndhraPradeshNews #BreakingNews











