బీహార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తు అధికారాలపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు, అధికారులపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలంటే ఇకపై ముందస్తుగా బీహార్ ప్రభుత్వ అనుమతి తీసుకోవడం తప్పనిసరి చేసింది. సెప్టెంబర్ 3న రాష్ట్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. దర్యాప్తు ప్రారంభించడం, సోదాలు నిర్వహించడం, విచారణ చేయడం, అరెస్టు చేయడం లేదా ఇతర చర్యలు తీసుకోవడం వంటి అంశాల్లో రాష్ట్ర అనుమతి అవసరం. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని కార్పొరేషన్లు, కంపెనీలు, బ్యాంకులు, బీహార్ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే సంస్థలకు సంబంధించిన ఉద్యోగులపైనా ఇదే నిబంధన వర్తిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో సీబీఐకి ఎలాంటి ముందస్తు రాష్ట్ర అనుమతి అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది, కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న ప్రైవేటు వ్యక్తులపై సీబీఐ తన అధికార పరిధిలో చర్యలు తీసుకోవచ్చని నోటిఫికేషన్ స్పష్టం చేసింది.
కేసు వారీగా రాష్ట్రం నిర్ణయం
1946 నాటి ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టంలోని సెక్షన్ 6 కింద బీహార్ గవర్నర్ ఈ సమ్మతిని జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యక్తులపై కేసుల్లో సీబీఐ ముందుగా ప్రతిపాదన పంపాలి. ఆ ప్రతిపాదనను పరిశీలించిన తర్వాత కేసు ప్రాతిపదికన దర్యాప్తుకు అనుమతి ఇవ్వాలా వద్దా అన్నది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అవినీతి నిరోధక చట్టం, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియమం, ఐటీ చట్టం కింద నమోదయ్యే కేసులతో పాటు సైబర్ నేరాల దర్యాప్తుకూ ఈ నిబంధన వర్తిస్తుంది. గతంలో ఉన్న నోటిఫికేషన్లను రద్దు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు హోంశాఖ తెలిపింది. ఈ నోటిఫికేషన్ ప్రతులను కేంద్ర సిబ్బంది మంత్రిత్వ శాఖ, సీబీఐ డైరెక్టర్, బీహార్ డీజీపీ, కేంద్ర ప్రభుత్వం, సంబంధిత శాఖలకు పంపించారు. దీంతో రాష్ట్ర పరిధిలోని అధికారులపై సీబీఐ చర్యలకు ముందు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కీలకంగా మారింది.
#Bihar #CBI #CBIInvestigation #BiharGovernment #CBIPermission #CBIPowers #BiharCBIRules #CBIProbe #BiharOfficials #BiharHomeDepartment #CBIJurisdiction #CBIArrest #CBISearch #StateGovernment #CentralGovernment #BiharPolitics #InvestigationRules











