పెళ్లి రిసెప్షన్ … పొలిటికల్ కనెక్షన్!
హరీష్, జగ్గారెడ్డి ముచ్చట్లు
రాములమ్మ రాక.. మొదలైన పొలిటికల్ కాక
రాజకీయ వేదికలపై కత్తులు దూసుకునే నేతలు.. కుటుంబ వేడుకలో మాత్రం ఆత్మీయంగా పలకరించుకున్నారు. రెండున్నర దశాబ్దాలుగా రాజకీయంగా ఎడమొహం పెడమొహంగా ఉన్న హరీశ్ రావు, జగ్గారెడ్డి 21 ఏళ్ల తర్వాత ఒకే ఇంట్లో కలుసుకున్నారు. జగ్గారెడ్డి ఆహ్వానంతో ఆయన ఇంటికి వచ్చిన హరీశ్ రావుకు ఘన స్వాగతం లభించింది. నూతన వధూవరులను ఆశీర్వదించి ఆత్మీయంగా ముచ్చటించారు. మరోవైపు విజయశాంతి రాకతో ఈ కలయికకు మరింత ప్రాధాన్యత పెరిగింది. ఇంతకీ ఇది కేవలం కుటుంబ మర్యాదా? పాత విభేదాలకు ముగింపా? రాజకీయాలకు అతీతమైన స్నేహానికి నిదర్శనమా? అయితే తమ కలయికలో ఎలాంటి రాజకీయ మతలబు లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. అసలు 21 ఏళ్ల తర్వాత ఏం జరిగింది? లోపలి కథేంటి?
ప్రత్యర్థులకు పెండ్లి పందిరిలో పీస్ ట్రీట్మెంట్!
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనే మాట మరోసారి నిజమైంది. ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయాల్లో నిత్యం విమర్శలు, సవాళ్లతో వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ నేత హరీశ్ రావు, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి 21 ఏళ్ల తర్వాత వ్యక్తిగతంగా కలుసుకున్నారు. జగ్గారెడ్డి ఇంట్లో జరిగిన కుటుంబ వేడుకకు హరీశ్ రావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. రాజకీయ ప్రత్యర్థులుగా కనిపించే ఇద్దరు నేతలు నవ్వుతూ పలకరించుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
2004 జ్ఞాపకాలు.. మళ్లీ కలిసిన నేతలు!
2004లో హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఛాంబర్లో ఇద్దరం కలిసి భోజనం చేసేవాళ్లమని జగ్గారెడ్డి గుర్తుచేశారు. ఆ తర్వాత తాను కాంగ్రెస్లో చేరడంతో రాజకీయంగా దూరం పెరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వ్యక్తిగతంగా కలుసుకోలేదని, ఇప్పుడు 21 ఏళ్ల తర్వాత కుటుంబ వేడుకలో కలిశామని వివరించారు. తన కుమార్తె వివాహానికి హరీశ్ రావును ఆహ్వానించలేకపోయానని, ఈసారి మాత్రం కుటుంబ కార్యక్రమానికి తప్పకుండా రావాలని ప్రత్యేకంగా కోరినట్లు తెలిపారు.
విజయశాంతి రాకతో మరింత ఆసక్తి!
ఈ వేడుకకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి హాజరు కావడం మరో చర్చకు కారణమైంది. గతంలో జగ్గారెడ్డి, విజయశాంతి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో ఆమె రాక ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో హరీశ్ రావు, జగ్గారెడ్డి, విజయశాంతి ఒకే వేదికపై కనిపించడం రాజకీయ వర్గాల్లో కొత్త ఊహాగానాలకు తెరలేపింది. అయితే ఈ కలయికను రాజకీయ సమీకరణాలతో ముడిపెట్టడానికి ప్రస్తుతానికి ఆధారాలేవీ లేవు.
రాజకీయాలు వేరు.. వ్యక్తిగత బంధాలు వేరు!
తమ కలయికలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం, మతలబు లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. హరీశ్ రావు బీఆర్ఎస్లో అగ్రనేత అని, తాను కాంగ్రెస్లో కొనసాగుతున్నానని పేర్కొన్నారు. రాజకీయాలు రాజకీయాలుగానే ఉంటాయని, వ్యక్తిగత సంబంధాలకు వాటిని అడ్డంకిగా చూడకూడదన్న సంకేతమిచ్చారు. మొత్తానికి రాజకీయ ప్రత్యర్థులను పెండ్లి పందిరి ఒక్కచోట చేర్చింది. ఈ ఆత్మీయత రాజకీయ వేదికలపైనా కొనసాగుతుందా? లేక వేడుక వరకే పరిమితమవుతుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.











