Home Telangana బెదిరిస్తే భయపడను.. దోస్తీకే గులామ్‌!

బెదిరిస్తే భయపడను.. దోస్తీకే గులామ్‌!

బెదిరింపులకు భయపడను.. స్నేహంతో గెలవాలి.
పాతబస్తీ వేదికగా రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

పాతబస్తీ అభివృద్ధి కార్యక్రమం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తి రేపాయి. చంచల్‌గూడ–సంతోష్‌నగర్‌ మధ్య నిర్మించిన భారీ స్టీల్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన “బెదిరిస్తే భయపడను.. స్నేహంతోనే నన్ను గెలవగలరు. నేను ఎవరికీ గులామ్‌ను కాదు.. దోస్తీకి మాత్రమే గులామ్‌ను” అని వ్యాఖ్యానించారు. ఎన్నికలు వస్తుంటాయని, పోతుంటాయని, గెలుపోటములు సహజమని అన్నారు. గత ప్రభుత్వం ఫ్లైఓవర్‌కు కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయిందని, నిర్మాణానికి ఒక్క పైసా ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు పూర్తి చేసిందన్నారు. “ఇది ఓల్డ్‌ సిటీ కాదు.. ఒరిజినల్‌ సిటీ” అని రేవంత్‌ వ్యాఖ్యానిస్తూ పాతబస్తీలోని ప్రతి గల్లీ తనకు తెలుసన్నారు. అసదుద్దీన్‌ ఒవైసీ కోరిన అభివృద్ధి పనులను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. బలాల కళాశాల అభివృద్ధికి అడిగిన రూ.20 కోట్లకు బదులుగా రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. నిధులు ప్రభుత్వం ఇస్తుందని, ఏడాదిన్నరలో పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేదేనని స్పష్టం చేశారు.

మెట్రో నుంచి కేబుల్‌ బ్రిడ్జి వరకు భారీ హామీలు

హైదరాబాద్‌ అభివృద్ధిపై సీఎం పలు కీలక ప్రకటనలు చేశారు. మీరాలం చెరువులో 3 కిలోమీటర్ల కేబుల్‌ బ్రిడ్జి నిర్మిస్తామని, వచ్చే ఎన్నికల్లోగా గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో పూర్తి చేస్తామని చెప్పారు. నాగోల్‌ నుంచి ఎల్‌బీనగర్‌, వనస్థలిపురం, రాజేంద్రనగర్‌, శంషాబాద్‌ వరకు మెట్రో విస్తరణ చేపడతామన్నారు. హైదరాబాద్‌లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించనున్నట్లు తెలిపారు. విద్య కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ సమయంలో అసదుద్దీన్‌ ఒవైసీ దేశానికి మద్దతుగా నిలిచారని ప్రశంసించారు. రాజకీయ సిద్ధాంతాలు వేరైనా దేశభక్తి విషయంలో అందరూ ఒక్కటేనన్నారు. హిందూ, ముస్లింలు కలిసి నడిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. మూసీ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తూ, మూసీ రివర్‌ఫ్రంట్‌తో నైట్‌ ఎకానమీని ప్రోత్సహించి పేద ముస్లింలకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు.. ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధే లక్ష్యమని రేవంత్‌ స్పష్టం చేస్తూ హైదరాబాద్‌ను కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

 

#RevanthReddy #OldCityHyderabad #HyderabadDevelopment #RevanthReddySpeech #TelanganaPolitics #OldCityDevelopment #HyderabadMetro #MusiRiverfront #AsaduddinOwaisi #HyderabadFlyover #TelanganaGovernment #HyderabadNews